PAK Vs NZ (PIC@ ICC X)

Bangalore, NOV 04: భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో (CWC-23) ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న సెమీస్ ఆశ‌ల‌ను పాకిస్థాన్ స‌జీవంగా ఉంచుకుంది. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. బెంగళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో (New Zealand) జ‌రిగిన మ్యాచ్‌లో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో (DLS) 21 ప‌రుగుల తేడాతో (Pakistan Win) గెలుపొందింది. 401 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో పాకిస్థాన్ బ‌రిలోకి దిగింది. అయితే.. పాక్ ఇన్నింగ్స్‌లో 21.3వ ఓవ‌ర్ పూర్తి అయ్యే స‌రికి వ‌ర్షం మొద‌లైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఆ స‌మయానికి పాకిస్థాన్ వికెట్ న‌ష్ట‌పోయి 160 ప‌రుగులు చేసింది. కాసేప‌టి త‌రువాత మ్యాచ్ ప్రారంభం కాగా.. పాకిస్థాన్ (Pakistan) ల‌క్ష్యాన్ని 41 ఓవ‌ర్ల‌లో 342కు కుదించారు. మ‌ళ్లీ మ్యాచ్ ప్రారంభ‌మైనా ఎక్కువ సేపు ఆట సాగ‌లేదు. 25.3 ఓవ‌ర్ల ఆట పూర్తికాగానే మ‌రోసారి వ‌ర్షం మొద‌లైంది. అప్ప‌టికి పాకిస్థాన్ వికెట్ న‌ష్ట‌పోయి 200 ప‌రుగులు చేసింది. ఎంత‌సేప‌టికి వ‌ర్షం త‌గ్గ‌లేదు. దీంతో మ్యాచ్ జ‌రిగేందుకు అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని (DLS Method) అంపైర్లు అనుస‌రించారు. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఆ స‌మాయానికి చేయాల్సిన ప‌రుగుల కన్నా మ‌రో 21 ప‌రుగులు అద‌నంగా చేసి ఉండ‌డంతో పాకిస్థాన్ ను విజేత‌గా ప్ర‌క‌టించారు. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (126; నాటౌట్ 81 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్స‌ర్లు) మెరుపు శ‌త‌కంతో ఆక‌ట్టుకున్నాడు. బాబ‌ర్ ఆజాం (63 నాటౌట్; 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించారు.

 

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ప్రపంచకప్ లో న్యూజిలాండ్ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర సెంచరీ (108; 94 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్)శ‌త‌కంతో చెలరేగాడు. కేన్ విలియమ్సన్ (95; 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ 41, మార్క్ చాప్మన్ 39, డేవాన్ కాన్వే 35, డారిల్ మిచెల్ 29 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ వాసిం జూనియర్ మూడు వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్ త‌లా ఓ వికెట్ సాధించారు.

 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెన‌ర్లు కాన్వే, ర‌చిన్ ర‌వీంద్ర లు శుభారంభం అందించారు. మొద‌టి వికెట్‌కు 68 ప‌రుగులు జోడించారు. కాన్వే ఔట్ కావ‌డంతో కేన్ విలియమ్సన్ జ‌త‌గా ర‌చిన్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్ద‌రు ఔట్ చేసేందుకు బాబ‌ర్ బౌల‌ర్ల‌ను మార్చి మార్చి ప్ర‌మోగించినా ఫ‌లితం లేక‌పోయింది. ఈ క్ర‌మంలో ర‌చిన్ 88 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో అత‌డికి ఇది మూడో సెంచ‌రీ కావ‌డం విశేషం.

మ‌రో వైపు ధాటిగా ఆడిన విలియమ్సన్ ఐదు ప‌రుగుల తేడాతో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. ఇఫ్తికార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ఔట్ అయ్యాడు. రెండో వికెట్‌కు ర‌చిన్‌-కేన్‌ల జోడి 180 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. మ‌రికాసేప‌టికే ర‌చిన్ ఔటైయ్యాడు. ఆఖ‌ర్లో గ్లెన్ ఫిలిప్స్ మిచెల్ శాంట్న‌ర్‌లు దూకుడుగా ఆడ‌డంతో న్యూజిలాండ్ స్కోరు 400 దాటింది.