Vjy, Mar 18: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే బెంబెలెత్తే పరిస్థితి. మార్చి ప్రారంభంలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్ మేలో భానుడు ప్రతాపం ఎలా ఉంటుందోనని (Andhra Pradesh Weather Forecast) ఏపీ వాసులు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ ఏపీ వాసులకు చల్లని కబురును అందించింది. రానున్న నాలుగు రోజులు ఏపీలో ఓ మాదిరి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్ లోని కచ్ లో స్వల్ప భూప్రకంపనలు
ప్రస్తుతం పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా, కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో రాష్ట్రంపైకి దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.వీటన్నిటి ఫలితంగా రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (light to moderate rain for next four days) అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం నాటి నివేదికలో వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో వేడి, ఉక్కపోతతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుంది. మరోవైపు ఈ నెల 20 నాటికి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌కు చేరువలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దాని ప్రభావంతో 20న ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవవచ్చని వివరించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.