Visakha, Nov 22: విశాఖ నగరంలోని సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఆటో సిగ్నల్ దగ్గర వేగంగా దూసుకువస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది.ఆటో బోల్తా పడగా అందులోని చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను.. స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డ విద్యార్థులలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని, మిగతా పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రమాద విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు పెట్టారు. గాయాలతో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న చిన్నారులను చూసి కంటతడి పెట్టారు.
ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్, క్లీనర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా.. చుట్టుపక్కల ఉన్న ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Here's CCTV Footage
Visakhapatnam | An auto collided with a truck at Sangam Sarat Theatre junction in Visakhapatnam. Eight school children were injured and shifted to the hospital. Four of them have been discharged. Three students are undergoing treatment. One student's situation is critical: said… pic.twitter.com/nNht8WC64a
— ANI (@ANI) November 22, 2023
ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. ఎంత వేగంగా ఆటో లారీని ఢీకొట్టిందే ఇట్టే తెలిసిపోతోంది. అయితే.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన అనంతరం పోలీసులు వెల్లడించారు.
డీసీపీ శ్రీనివాసరావు ఘటనపై మాట్లాడుతూ..విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ జంక్షన్ వద్ద ట్రక్కును ఆటో ఢీకొంది. ఎనిమిది మంది పాఠశాల విద్యార్థులకు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.