చదవాలన్న కసి ఉంటే ఎప్పుడైనా సక్సెస్ కావొచ్చు. పట్టుదలే ఆయుధంగా చదివితే పేదరికం సైతం చిన్నబోతుంది. అవును ఈ సాకే భారతి విషయంలో అది అక్షరాల రుజువైంది. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఓ మహిళ అనంతపురం ఎస్.కె.యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా తీసుకుంది.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి తన భర్త, కూతురుతో కలిసి వెళ్లారు సాకె భారతి. ఎక్కడా గర్వం లేదు.. పారగాన్ చెప్పులూ, ఓ సాదా చీరతో అలా వేదికపైకి వెళ్లగానే అక్కడున్న పెద్దలు, అతిథులు కూడా ఆమె వేషధారణ చూసి ఆశ్చర్యపోయారు
ఓ వైపు దినసరి కూలీగా పనులు చేసుకుంటూనే.. ఏకంగా కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా సాధించిన సాకె భారతి జీవితం చాలా మందికి ఆదర్శ ప్రాయం. అనంతపురం జిల్లాకు శింగనమల నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన సాకే భారతికి బాగా చదువుకోవాలని ఆశ. ఆమె పదో తరగతి వరకూ శింగనమల ప్రభుత్వ స్కూల్‌లో, ఇంటర్‌ను పామిడి జూనియర్ కాలేజీలో పూర్తి చేసింది.
Here's Video
The future belongs to those who believe in their dreams, and this is yet another inspirational example of the story of Andhra Pradesh under @ysrcparty https://t.co/TLATD1LNBM
— YSR Congress Party (@YSRCParty) July 20, 2023
తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. అందరిలో భారతి పెద్ద.. వీరి బాధ్యతలు ఆ కుటుంబానికి భారంగా మారింది. ఆర్థిక స్థితి కూడా అంతంతమాత్రం. అందుకే భారతిని శింగనమల మండలం నాగులగుడ్డంకు చెందిన మేనమామ శివప్రసాద్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడితో చదువుకు అంతరాయం ఏర్పడింది. బాగా చదువుకోవాలన్న భారతి ఆశపడినా.. ఆ విషయం భర్తకు చెప్పలేక పోయింది.
కొంతకాలానికి భారతి భర్త ఆమె కోరిక గురించి తెలుసుకున్నాడు. బాగా చదువుకోవాలని ప్రోత్సాహం అందించాడు. రోజూ కూలి పనులకు వెళితేనే కడుపు నిండుతుంది. అందుకే భారతి కొన్నిరోజులు కాలేజీకి వెళ్లి.. మిగిలిన రోజుల్లో కూలి పనులు చేశారు. అప్పటికే కూతురు గాయత్రి ఉంది.. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంంది. అలా అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. చదువుతో పాటూ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు కూలి పనులకు వెళ్లారు భారతి. అన్ని పనులు చక్కబెట్టుకుంటూనే కష్టపడి చదివారు.
తాను కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి 28 కిలో మీటర్లు ప్రయాణం. రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి.. ఎనిమిది కిలోమీటర్లలో ఉన్న గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడి నుంచి బస్సెక్కి కాలేజీకి వెళ్లేవారు. అలా కష్టపడి చదివి డిగ్రీ, పీజీ మంచి మార్కులతో చేశారు. పీజీతో చదువు ఆగిపోవాల్సిందేనా.. ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్న భారతి మనసులో మొదలైంది. ఇంతలో లెక్చరర్లు, భర్త పీహెచ్‌డీ దిశగా అడుగులు వేయించారు. ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ డా.ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’ అంశంపై పరిశోధనకు అవకాశం దక్కింది. పీహెచ్‌డీ అంటే ఊరికే రాదు.. ఆర్థికంగా కొంత అండ ఉండాలి. అలాంటి సమయంలో వచ్చిన ఉపకార వేతనం భారతికి సాయమైంది.
పీహెచ్‌డీ చేస్తున్నా సరే కూలి పనులు చేస్తూనే ఉన్నారు భారతి. డాక్టరేట్ అందుకుంటే తన కుటుంబానికి మంచి జరుగుతుందని.. యూనివర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చని.. అందరి జీవితాలే బాగుపడతాయని భావించారు. ఇలా కష్టపడి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు భారతి. భారతి విజయం వెనుక ఉన్న ఆమె భర్త శివప్రసాద్‌ను కచ్చితంగా ప్రశంసించాల్సిందే.
ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం (ఎరుకల)లో, ఆమె నివసిస్తున్న శింగనమల మండలం నాగుల గుడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలియకపోవడం.