Hyd, July 20: పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం కోసం పెట్టుకునే దరఖాస్తులో కులం, మతం వద్దనుకునేవారికి వీలుగా ఓ కాలమ్ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్’, ‘నో రిలీజియన్’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది.ఆ ప్రస్తావన లేకుండా పుట్టిన తేదీ ధ్రువీకరణ దరఖాస్తును స్వీకరించడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని పురపాలక, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు మున్సిపల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
జైళ్లు సిద్ధం చేసుకోండి కేసీఆర్..మేమంతా రెడీ, బీజేపీ నేతల హౌస్ అరెస్టుపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తమ కుమారుడికి నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ ఇవ్వాలని 2019లో సండెపు స్వరూప పలుమార్లు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కుల, మత ప్రస్తావన లేకుండా ప్రతిపాదించిన తమ బిడ్డ జనన ధ్రువీకరణ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సందేపు స్వరూప, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఇలా చేయడం లౌకిక రాజ్యాంగానికి విరుద్ధమని... కులం, మతం ప్రస్తావన లేకున్నా దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని మొదట ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు.
అనంతరం ఇది వ్యక్తిగత అంశమైనందున పిటిషన్‌గా మార్పుచేసి హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలను విన్న జస్టిస్ కన్నెగంటి లలిత బుధవారం తీర్పు వెలువరిస్తూ రాజ్యాంగంలోని అధికరణ 25 ప్రకారం నచ్చిన మతం ఆచరించడానికి హక్కు ఉందని, అదేవిధంగా ఆచరించకుండా ఉండే హక్కుకూడా ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఆన్‌లైన్‌తోపాటు ఇతర దరఖాస్తుల్లో కులం, మతం ప్రస్తావన వద్దనుకునే వారికోసం ఓ కాలమ్ ప్రవేశపెట్టాలని విద్యాశాఖ, పురపాలకశాఖ కార్యదర్శులతోపాటు కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.
‘పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించడం రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ఆర్టికల్ 14, 19, 21, 25ను ఉల్లంఘించడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛతో పాటు ఇలాంటి కొన్ని హక్కులు పౌరులకు ఉన్నాయి. ఏ మతాన్ని, కులాన్ని ఆచరించకూడదని ఎంచుకునే హక్కు పౌరులకు ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఇదే చెబుతోంది. నో క్యాస్ట్.. నో రిలీజియన్ అనే కాలాన్ని అన్ని దరఖాస్తుల్లో (ఆన్‌లైన్‌లోనూ) చేర్చాలని మున్సిపల్ కమిషనర్లకు, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నారు.