Hyderabad, May 11: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనంతో మరో తుఫాన్ ముంచుకురాబోతోంది. ఈ అల్పపీడనం (low pressure) బుధవారం తుఫాన్ (Cyclone)గా మారే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం (Chennai Meteorological Research Centre) వెల్లడించింది. దక్షిణ అండమాన్‌ను (South Andaman) ఆనుకుని బంగాళాఖాతం పశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేణ బలపడి తుపాన్‌గా మారనుందని తెలిపింది. దీంతో 90 కి.మీ. వేగంతో కన్యాకుమారి, బంగాళాఖాతం ఆగ్నేయ మధ్య ప్రాంతాల్లో గాలులు వీస్తాయన్నారు. 12వ తేదీ వరకు సముద్రంలో జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ తుఫాన్ ప్రభావం తెలుగురాష్ట్రాలపై ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల చెదురుమొదురు వర్షాలు మాత్రమే పడుతాయన్నారు.
Re-Up: No impact of cyclone on #Odisha, Andhra: IMD DG https://t.co/TGSGVdzml8
— OTV (@otvnews) May 10, 2023
ఇదిలా ఉండగా కోయంబత్తూరు, ఈరోడ్, తిరుపూర్ తదితర జిల్లాల్లోని పలు చోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బుధవారం సయితం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఈ నెల 19వ తేదీ నాటికి మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారనుంది. దీనికి ‘మోచా’ అని పేరు పెట్టారు. అది క్రమంగా ఉత్తర వాయువ్యంగా కదిలి.. ఆ తర్వాత దిశ మార్చుకుంటుంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలపై మాత్రం తుఫాన్ ప్రభావం చూపుతుంది.
ఇక తుఫాన్ తర్వాత వానలు తగ్గుముఖం పట్టి మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తుఫాన్ పైకి వెళ్లగా పశ్చిమ గాలులు తెలుగు రాష్ట్రాలపైకి వీయడంవల్ల ఎండ వేడి మరింత తీవ్రమవుతుంది. ఈ నెల 13 నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మే నెల మొత్తం ఇలాంటి పరిస్థితే ఉండవచ్చునని పేర్కొంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.