Andhra Pradesh - Amaravathi. | Photo: Wikimedia Commons.

Amaravati, July 21: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయం పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉందని, అందులో రహస్యమేమీ లేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. రాజధానికి సంబంధించి వాస్తవాలన్నీ అప్పటికే ప్రజలకు తెలిసినందున అమ్మినవాళ్లకు నష్టం వచ్చిందని చెప్పడానికి ఆస్కారం లేదని.. విక్రయదారులను కొనుగోలుదారులు మోసం చేసినట్లు ఆధారాలు లేవని తేల్చింది. లావాదేవీలన్నీ ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినప్పుడు అందులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ (Insider Trading In Amaravati Lands) అనడానికి ఏమీ లేదంది.

ఈ కేసులోని పూర్వాపరాలను హైకోర్టు (AP High Court) కూలంకషంగా పరిశీలించాకే తీర్పు చెప్పిందని, ఆ తీర్పులో ఎక్కడా తప్పులు లేవని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. అందుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వు మంగళవారం విడుదలయింది.

ఇప్పటికే అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ (Insider Trading) జరగలేదంటూ... సీఐడీ (CID) నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆరు పిటిషన్లను దాఖలు చేసింది. ఇవి విచారణకు రాగా సోమవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీటిని కొట్టివేసింది. దానికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులను వెలువరించింది.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి

అమ్మకందారుల ప్రయోజనాలను కొనుగోలుదారులు పరిరక్షించాలన్న చట్టబద్ధమైన నిబంధనలు లేవని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు కొనసాగిస్తే.. కొందరు అధికారులు తప్పులు చేసినట్లు రుజువు కావచ్చని ఫిర్యాదుదారు తరఫు సీనియర్‌ న్యాయవాది పరస్‌ కుహాడ్‌ పేర్కొన్నారని.. అయితే లావాదేవీలన్నీ ప్రైవేటు భూములకు సంబంధించినవని, ప్రైవేటు వ్యక్తుల మధ్యే జరిగాయని.. హైకోర్టు కూడా ఇదే అభిప్రాయపడిందని ధర్మాసనం గుర్తుచేసింది.

అందుచేత తాము జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రాథమిక దశలోనే ఈ కేసులో జోక్యం చేసుకోడానికి హైకోర్టుకు పరిధి లేదన్న రాష్ట్రప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు లోతుల్లోకి హైకోర్టు వెళ్లకుండా ఉండాల్సిందని.. తాను గమనించిన వాస్తవాలను రికార్డు చేయకుండా ఉండాల్సిందన్న వాదననూ తిరస్కరించింది.

ఈ వాదనను అంగీకరిస్తే.. కోర్టు ప్రక్రియ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఏ కోర్టులూ తమ అధికారాలను ఉపయోగించవని పేర్కొంది. క్రిమినల్‌ ఫిర్యాదులో గానీ, ఎఫ్‌ఐఆర్‌లో గానీ పేర్కొన్న వివరాల ఆధారంగా నిందితుడిపై విచారణ సాగించవచ్చో లేదో కోర్టులు తప్పక చూడాలన్నది తమ అభిప్రాయమని ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టు ఈ కోణంలో విస్తృత పరిశీలన జరిపిందని తెలిపింది. వాస్తవాలను పరిశీలించి ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ.. తాను కనుగొన్న అంశాలను హైకోర్టు రికార్డు చేయడంలో ఎలాంటి చట్టవిరుద్ధతా లేదని స్పష్టంచేసింది.

విశ్వాస ఉల్లంఘన లేనందున సెక్షన్‌ 486, ఎలాంటి నేరపూరిత కుట్రా లేనందున సెక్షన్‌ 120బీ ఈ కేసులో వర్తించవని హైకోర్టు తెలిపింది. హరియాణా ప్రభుత్వం వర్సెస్‌ భజన్‌లాల్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలించాకే ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని నిర్ణయించింది..’ అని స్పష్టం చేసింది. అలాగే ఐపీసీ సెక్షన్‌ 418 ఈ కేసులో వర్తించదని.. ఈ కోణంలో రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో వాదించలేదని, పిటిషన్‌లోనూ ప్రభుత్వం దీనిని కారణంగా చూపలేదని పేర్కొంది. ఈ కారణాల రీత్యా ప్రభుత్వ పిటిషన్‌లో మెరిట్‌ లేదని, కాబట్టి దీనిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి నిరోధక చట్టం కింద విచారించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరుతున్నారు. అయితే ఇందులో జరిగిన భూ లావాదేవీలన్నీ ప్రైవేటు వ్యక్తులవే. రాజధాని ఎక్కడన్నది ప్రజలకు ముందే తెలుసని హైకోర్టు కూడా చెప్పినందున ఈ అంశంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో పేర్కొన్న సాక్ష్యాధారాలు నిజమైనవా... కావా? అని తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించాల్సినంత కేసేమీ కాదిది.

అందుకే ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో ఏమైనా మోసాలు ఉన్నాయా... లేదా? అన్న అంశాన్ని హైకోర్టు పరిశీలించింది. దాని తర్వాత ఐపీసీ సెక్షన్‌ 420, 406, 409, 120బి కింద పేర్కొన్న నేరాల పరిధిలోకి ఇది రాదని తేల్చింది. అందువల్ల రాష్ట్రప్రభుత్వం వేసిన కేసులో మెరిట్‌ లేదు. అందుకే డిస్మిస్‌ చేస్తున్నాం’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.