Hyderabad, AUG 12: తెలంగాణకు (Telangana) పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వందల కంపెనీలు పెట్టుబడి పెట్టి.. తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఇప్పటికే ఫాక్స్‌కాన్ (Foxconn) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవ్వగా, మరో కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది. గతంలో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్ కాన్ సిద్ధంగా ఉందన్నారు. ఫాక్స్ కాన్ గ్రూపుతో తమ స్నేహం స్థిరంగా ఉందని తెలిపారు. ఈ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధిని రుజువు చేస్తున్నాయని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Our friendship with Foxconn Group remains steadfast, each of us delivering on mutual commitments
With total infusement of $550m (adding previous $150m), FIT is poised to deliver on its promises in Telangana
This once again proves Telangana Speed pic.twitter.com/DOssnhmyRo
— KTR (@KTRBRS) August 12, 2023
రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ (Foxconn) తయారీ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్‌లో రూ.1,656 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఫాక్స్ కాన్. ఈ నిర్మాణ పనులకు మే 15న కేటీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ పనులు కొనసాగుతుండగానే అదనంగా మరో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నాయని ఫాక్స్ కాన్ ప్రకటించడం విశేషం. సుస్థిరమైన పాలన, అద్భుతమైన వనరులు, సరళతరమైన ఇండస్ట్రియల్ పాలసీల వల్లనే ఇన్వెస్టర్లు తెలంగాణవైపు చూస్తున్నారు. ముఖ్యంగా టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక పాలసీలతో వందలాది కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. రోజుల వ్యవధిలోనే అనుమతులు వస్తుండటంతో అంతర్జాతీయ కంపెనీలు తమ గమ్యస్థానంగా తెలంగాణను ఎంచుకుంటున్నాయి.