
Hyderabad, OCT 26: విపక్షాల కుట్రలను తిప్పికొట్టి మ్యానిఫెస్టోలో ఇచ్చిన 16 హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ పార్టీ మరో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ‘కేసీఆర్ భరోసా’ (KCR Bharosa) పేరుతో పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి బీఆర్‌ఎస్ పదేండ్ల విజయాలు, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే అమలు చేయబోయే 16 హామీలను అర్థమయ్యేలా వివరిస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) బుధవారం తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు కూడా గురువారం నుంచే ప్రారంభం కానున్నాయి. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించనున్నారు.
ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచారంలో (Campaign Meetings) భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 9 వరకు 17 రోజులపాటు 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 15న హుస్నాబాద్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్, 18వ తేదీ వరకు నిర్వహించిన ఏడు సభల్లో ప్రసంగించారు. 19 నుంచి 25 వరకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభలకు విరామం ప్రకటించారు. అయితే ముందుగా విడుదల చేసిన తాత్కాలిక షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేట నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
ఇవాళ నిర్వహించే మునుగోడు సభపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సరిగ్గా సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏడాది తిరగకముందే కమలదళానికి నీళ్లు వదిలారు. బుధవారం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడు, చండూరు వేదికగా నాడు సీఎం కేసీఆర్ ప్రకటించిన దాదాపు అన్ని హామీలను (చండూరు రెవెన్యూ డివిజన్ సహా) బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది.
ప్రతి ఎన్నికకు పార్టీలు మారే నాయకులు కావాలా? ఎన్నటికీ మునుగోడుతో పెనవేసుకున్న బీఆర్‌ఎస్ పేగుబంధం కావాలా? అనేది తేల్చుకునే క్రమంలో డోలాయమానంలో ఉన్న మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. మారుతున్న నేత కావాలా? ప్రజల మేలు కోరే పార్టీ కావాలా? సొంత ప్రయోజనం కోసం పార్టీ మారే నేత కావాలా? అన్న మీమాంసలో మునుగోడు పడింది. ఈ మీమాంసను సీఎం కేసీఆర్ నేడు పటాపంచలు చేస్తారనే ప్రచారం మునుగోడులో పరివ్యాప్తం కావటం విశేషం.
13 రోజులు.. 36 సభలు
26.10.2023 అచ్చంపేట, వనపర్తి,మునుగోడు
27.10.2023 మహబూబాబాద్,వర్దన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్
29.10.2023 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
30.10.2023 జుక్కల్ , బాన్సువాడ,నారాయణఖేడ్
31.10.2023 హుజూర్‌నగర్,మిర్యాలగూడ, దేవరకొండ
01.11.2023 సత్తుపల్లి, ఇల్లందు
02.11.2023 నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
03.11.2023 భైంసా (ముథోల్),ఆర్మూర్, కోరుట్ల
05.11.2023 కొత్తగూడెం, ఖమ్మం
06.11.2023 గద్వాల్, మక్తల్, నారాయణపేట్
07.11.2023 చెన్నూరు, మంథని, పెద్దపల్లి
08.11.2023 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
09.11.2023 గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగ సభ