BRS leaders Join in BJP (PIC Credit : ANI)

New Delhi, March 10: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు ఇవాళ బీజేపీలోకి చేరారు. సీతారాం నాయక్ (Seetaram Naik), జలగం వెంకట్ రావు(Jalagam Venkat Rao), సైదిరెడ్డి, గోడం నగేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గోమాస బీజేపీలో చేరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేశ్ గౌడ్ సమక్షంలో బీజేపీలో ఈ చేరికలు జరిగాయి. ఎన్నికల వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ వేగం పెంచి, ఇంతకుముందే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను తమ పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే మాజీ ఎంపీ సీతారాంనాయక్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. బీజేపీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధిష్ఠానంపై సీతారాం నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. సీతారాం నాయక్ ను మహబూబాబాద్ నుంచి, జలగం వెంకట్రావును ఖమ్మం నుంచి పోటీలోకి దించాలని బీజేపీ భావిస్తోంది.

 

ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానని జలగం వెంకట్రావు అన్నారు. ఖమ్మం అభివృద్ధి చెందడం లేదని చెప్పారు.ఖమ్మం అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలూ ఉన్నప్పటికీ డెవలప్ కావడం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు ఖమ్మానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. అలాగే, మైనింగ్ కాలేజీని యూనివర్సిటీ చేయలేదని, భద్రాచలం గుడిని అభివృద్ధి చేయలేదని అన్నారు. తమ జిల్లాకు రావాల్సిన నీళ్లు రావడం లేదని అన్నారు. శ్రీనివాస్ గోమాస మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులను ప్రధాని మోదీ కాపాడుతున్నారని చెప్పుకొచ్చారు. పెద్దపల్లిలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తాను వారి గెలుపుకోసం పని చేస్తానని చెప్పారు. క్రమశిక్షణగల కార్యకర్తగా పనిచేస్తానని సైది రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తానని అన్నారు.