Credit @ ANI Twitter

Ramagundam, NOV 12: సింగరేణి ప్రైవేటీకరణ (Singareni pravaitazation) ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో (Ramagundam) ఆర్ఎఫ్సీఎల్‌లో (RFCL) ఎరువుల ఉత్పత్తి ఫ్యాక్టరీని, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదని ప్రధాని మోదీ అన్నారు. మెజార్టీ వాటా రాష్ట్రానిదైతే కేంద్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుందని నిలదీశారు. హైదరాబాద్ నుంచి కొందరు సింగరేణిపై తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. కాగా, అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచామని ప్రధాని మోదీ చెప్పారు. దీంతో అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని అన్నారు.

ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని మోదీ అన్నారు. తాము ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఫర్టిలైజర్ ప్లాంట్, రైల్వే జోన్, రోడ్ల విస్తరణ వంటి వాటితో రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన కూడా సింగరేణిపై స్పందించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

 

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. అనంతరం భద్రాచలం నుంచి సత్తుపల్లి రైల్వే లైన్‌ను సైతం మోదీ జాతికి అంకితం చేశారు. 3 నేషనల్‌ హైవేలకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. వీటికి రూ. 2,268 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. వీటిలో ఎల్కతుర్తి-సిద్ధిపేట-మెదక్‌, సిరొంచ-మహదేవ్‌పూర్, బోధన్‌-భాసర్ హైవేలు ఉన్నాయి.

రామగుండంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ తన స్పీచ్‌ను తెలుగులో మొదలు పెట్టారు. సభకు విచ్చేసిన రైతులు, సోదర సోదరీమణులకు నమస్కారములు అంటూ మోదీ స్పీచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ ఒక్కరోజులోనే రూ. 10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించాం. రైల్వేలు, రోడ్ల ప్రాజెక్ట్‌ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయి. గత రెండున్నరేళ్లుగా కరోనాతో పోరాడుతున్నాం. కరోనాతో పాటు యుద్ధాల వల్ల సంక్షోభం వచ్చింది. ఈ కష్టకాలంలోనూ దేశంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది’ అని మోదీ చెప్పుకొచ్చారు.

‘రైతుల కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేశాము. రానున్న రోజుల్లో మరో రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాం. బొగ్గు గనుల విషయంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు. సింగరనేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. హైదరాబాద్‌ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు. సింగరేణిలో తెలంగాణ వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటానే ఉంది. ప్రైవేటీకరణ చేయడం కేంద్రం చేతిలో లేదు. గతంలో బొగ్గు గనుల్లో వేల కోట్ల అవినీతి జరిగింది. ఇప్పుడు గనుల కేటాయింపులు పూర్తి పారదర్శకంగా సాగుతోంది’ అని చెప్పుకొచ్చారు.