డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ద్వారా దేశ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసి మరిని ప్రయోగాలకు వేదికగా నిలుస్తామని బడ్జెట్ 2023 సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పాన్ నంబరును (PAN Number) అన్ని వ్యాపారాలకు ఐడెంటిఫయర్‌గా (PAN to be used as common identifier)ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అనుమతుల కోసం వ్యాపారులు వెళ్లినపుడు పాన్ నంబరు చెబితే చాలు.
అధికారులు వ్యాపారి పాన్ నంబరు కొట్టగానే దానికి అనుసంధానమై ఉన్న అన్ని పత్రాలు వారి సిస్టంలో (digital systems) కనిపిస్తాయి.తద్వారా ఆయా పత్రాల జిరాక్స్ కాపీలను ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకువెళ్లాల్సిన పనిలేదు. వాటిని అధికారులకు పదేపదే ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో చూసి ఓకే చేస్తారు కాబట్టి దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుంది.
ప్రస్తుతం వ్యాపారాలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు 13కు పైగా వివిధ రకాల కార్డులను ఐడీలుగా అడుగుతున్నారు. ఇక నుంచి పాన్ ఇస్తే చాలు.మిగతా కార్డులు ఏవీ అవసరం లేవు. ఇందుకోసం అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో వ్యవస్థను తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన అడుగులు వేస్తోంది. ఇక భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే మెషిన్ లెర్నింగ్ కీలకపాత్ర పోషించనుంది. దీనికి భారీ స్థాయిలో డేటా అవసరం.ఇందుకోసం ప్రభుత్వం నేషనల్ డేటా గవర్నింగ్ పాలసీని అందుబాటులోకి తీసుకువస్తోంది.