Fact Check: ఫాస్టాగ్‌ స్కాన్‌ చేసి డబ్బులు కొట్టేయడం అసాధ్యం, ఆ బుడ్డోడి వీడియో ఫేక్, క్లారిటీ ఇచ్చిన NPCI,పేటీఎం సంస్థలు, ఫాస్టాగ్‌ వ్యక్తికి, వ్యక్తికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్‌ కాదని వెల్లడి
FASTag Smart Watch Scam Fact Check: No person-to-person transactions via FASTags, NPCI clarifies on fraud claim videos (Photo-Video Grab)

జాతీయ రహదారులపై టోల్‌ గేట్ల వద్ద చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టాగ్‌ వ్యవస్థలో వ్యక్తుల మధ్య లావాదేవీలు సాధ్యం కాదని భారత జాతీయ చెల్లింపుల మండలి(ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. కారు అద్దం తుడుస్తున్న వ్యక్తి, ఫాస్టాగ్‌ నుంచి డబ్బులు కాజేసినట్లు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫాస్టాగ్‌ టోల్‌ ప్లాజాల వద్ద చెల్లింపులకు మాత్రమే ఉపకరిస్తుందని, ఒకరి నుంచి ఒకరికి చెల్లింపులు చేసుకునేందుకు ఉపయోగపడదన్నది.ఫాస్టాగ్‌ వ్యక్తికి, వ్యక్తికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్‌ కాదు. కేవలం ఫాస్టాగ్‌ నెట్‌వర్క్‌లోని స్కానర్ల ద్వారానే జరుగుతుంది. ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేయడానికి ప్రత్యేక హార్డ్‌వేర్‌ ఉంటుంది. వేరే వ్యక్తులు ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా డబ్బులు కొల్లగొట్టలేరని తెలిపింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ బాలుడు ఫాస్టాగ్‌ స్టిక‍్కర్‌ అంటించి ఉన్న కారు అద్దాలు తుడిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో తన చేతికి ఉన్నవాచ్‌ను..ఆ ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ మీద ట్యాప్‌ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో అనుమానం వచ్చిన కారులోని ప్రయాణికులు సదరు బాలుడ్ని " ఏం చేస్తున్నావు. ఇటు రా అంటూ" పిలుస్తారు.

దీంతో కారు అద్దం తుడుస్తున్న బాలుడు..కారు యజమానికి దగ్గరికి రాగా..ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ మీద ఎందుకు ట్యాప్‌ చేస్తున్నావు? అని ఆ వాచ్‌ గురించి అడగ్గా.. బాలుడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళతాడు. వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఏమాత్రం వాస్తవం లేదని పేటీఎం కొట్టి పారేసింది. ఈ వీడియో ఫేక్ అని PIB కూడా నిర్థారించింది.