టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సంగతి విదితమే. లే ఆఫ్స్ కలకలంతో ఉద్యోగుల్లో భయాందోళనల నడుమ వారికి ఊరటనిచ్చే వార్తను ఓ సర్వే వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం (bigger salary hike in 2023) ఉందని, ఇది గత ఏడాది కంటే కేవలం 0.4 శాతం ఎక్కువని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే వెల్లడించింది. మాంద్యంతో ప్రపంచవ్యాప్తంగా భయాలు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆశాజనకంగా ఉందని కార్న్ ఫెర్రీ ఛైర్మన్, రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనిత్ సింగ్ సర్వేలో పేర్కొన్నారు.
తాజాగా 818 సంస్థలు, 8 లక్షలకు పైగా ఉద్యోగులపై జరిపిన సర్వేలో, భారతీయ కార్పొరేట్ ఉద్యోగులు 2023లో సగటున 9.8 శాతం సాలరీ పెంపు ఉండొచ్చని సర్వే పేర్కొంది. అత్యుత్తమ నైపుణ్యాలను కనబరిచే ఉద్యోగులకు ఆయా కంపెనీలు ఏకంగా 15 శాతం నుంచి 30 శాతం వరకూ వేతన పెంపు (average salary hike in India) వర్తింపచేయవచ్చని తెలిపింది. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్‌తో సహా పలు రంగాల్లో (Indians working for tech and gaming companies) ఈ ఏడాది జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది.
సర్వే ప్రకారం.. టెక్నాలజీలో 10.4 శాతం, మీడియా 10.2 శాతం, గేమింగ్ 10 శాతం. అదనంగా, కొన్ని ఇతర రంగాల జీతాల పెంపు అంచనాలలో సేవా రంగం 9.8 శాతం, ఆటోమోటివ్ 9 శాతం, రసాయనం 9.6 శాతం, వినియోగ వస్తువులు 9.8 శాతం, రిటైల్ 9 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది. అదనంగా, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌లకు అనుగుణంగా చాలా వ్యాపారాలు తమ శ్రామిక శక్తిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సర్వే సూచిస్తుంది. సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం సంస్థలు తాము ఒక రకమైన హైబ్రిడ్ మోడల్‌ను స్వీకరించినట్లు సూచించాయి.
సర్వే ప్రకారం, టైర్ 1 నగరాల్లోని ఉద్యోగులు టైర్ 2, టైర్ 3 నగరాలతో పోల్చినప్పుడు అధిక వేతనాలు పొందుతున్నారు.అయితే రానున్న కాలంలో టైర్ 2 నగరాల్లోని ఉద్యోగులు కూడా ఈ ఏడాది అధిక జీతాలు పొందే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.