Hyderabad: వృతిరీత్యా మెకానికల్ ఇంజినీర్, ప్రొఫెసర్ అయిన హైదరాబాద్ కు చెందిన సతీష్ కుమార్ (Sateesh Kumar) ప్లాస్టిక్ (Plastic) నుంచి ఇంధనం (Fuel) తయారీ చేయడంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మిసిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (MSME- Ministry of Micro, Small and Medium Enterprises) పేరుతో తన కంపనీని రిజిస్టర్ చేసుకున్న సతీశ్ 2016 నుంచి ఇప్పటివరకు 50 టన్నుల నాన్- బయోడీగ్రేడేబుల్ (నాశనం చేయలేని) ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చారు. ఈ ఇంధనాన్ని కేవలం రూ. 40 లీటర్ చొప్పున అమ్ముతున్నారు. వివిధ ఫ్యాక్టరీల నుంచి సతీష్ తయారు చేస్తున్న ఈ ఇంధనానికి మంచి డిమాండ్ ఉంది.
ఈ ఇంధన తయారీ ప్రక్రియను సతీష్ వివరిస్తూ.. 3 దశలలో ప్లాస్టిక్‌ను పెట్రోల్ , డీజిల్ గా కన్వర్ట్ చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియను 'ప్లాస్టిక్ పెరాలసిస్' (plastic pyrolysis) అంటారని తెలిపారు. ప్లాస్టిక్‌ను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద పీడనాన్ని పంపించడం ద్వారా ఇంధనం ఉత్పత్తి అవుతుందట. ఈ ప్రక్రియలో ఎలాంటి నీరు అవసరం లేదు, అలాగే దీని తయారీలో ఎలాంటి పదార్థాలు కూడా బయటకు విడుదల కావని ఆయన చెప్తున్నారు.
పైపుల తయారీకి ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ (PVC) మరియు ప్లాస్టిక్ డబ్బాలు, నీళ్ల బాటిళ్ల తయారీకి ఉపయోగించే పాలిథిలీన్ టెరెప్తలేట్ (PET) లాంటి ధృడమైన ప్లాస్టిక్ మినహా మిగతా ఎలాంటి ప్లాస్టిక్‌తో అయినా ఇంధనం తయారు చేయవచ్చునంట.
ఇలా వారి కంపెనీ రోజుకు 200 కేజీల ప్లాస్టిక్‌ను 200 లీటర్ల ఇంధనంగా మార్చి పలు ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ ఇంధనం అని, దీనిని మండించడం ద్వారా పర్యావరణంలోకి ఎలాంటి విషవాయువులు వెలువడవు అని వారు చెప్తున్నారు. పర్యావరణానికి ఏదైనా మేలు చేయాలనే లక్ష్యంతో తాము ఈ ఇంధనాన్ని ప్రవేశ పెట్టామని, ఏవైనా కంపెనీలు ముందుకు వస్తే వారితో కూడా తమ టెక్నాలజీని పంచుకుంటామని ప్రొ. సతీష్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇంధనాన్ని ఫ్యాక్టరీ అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. వాహానాలకూ ఈ ఇంధనాన్ని వాడటంపై ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది.
చివరగా చెప్పేది ఏమిటంటే..
వాయు కాలుష్యం, ఇంధన ధరల పెరుగుదలపై ఎప్పుడూ ఆందోళన చెందే ప్రభుత్వాలు ఇలాంటి వారిని గుర్తించి పర్యావరణానికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించాలి.
అదేకాదు, అసలు నిజంగా ఇలాంటి ఇంధనాలు పర్యావరణానికి మేలు చేస్తాయా? ఫ్యాక్టరీలలో ఇలాంటి ఇంధనాలు వాడటం వల్ల ఎలాంటి కాలుష్యం జరగదని వారు చెప్తున్నప్పటికీ అందులో నిజమెంత? ఒకవేళ నిజంగా ఇలాంటి ఇంధనంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ స్థానంలో ఈ ఇంధనం వాడకాన్ని ప్రోత్సహిస్తే అటూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు, అలాగే ప్రజలపై మాటిమాటికి ఇంధన ఖర్చుల భారం మోపడం తగ్గించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? చూడాలి.