Chandrayaan-3 Mission: జయహో భారత్, చంద్రునిపై విక్రమ్ అడుగు పెట్టేది ఆ రోజు తెల్లవారుజామునే, అద్భుత ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచం
Chandrayaan 3 Mission Update (Photo Credits: X/2isro)

జాబిల్లి (Moon)పై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రయాన్‌-3 వ్యోమననౌక చంద్రుడికి మరింత చేరువైంది. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో ల్యాండ్‌ కానుంది.

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన తర్వాత ల్యాండ్‌ మాడ్యూల్‌ పంపిన సందేశాన్ని బెంగళూరులోని ఐఎస్‌టీఆర్‌ఏసీ కేంద్రం అందుకొంది. ‘‘థ్యాంక్స్‌ ఫర్‌ ది రైడ్‌, మేట్’ అని ల్యాండర్‌ మెసేజ్‌ పంపినట్లు ఇస్రో ట్విటర్‌లో ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఇక నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ చందమామను సొంతంగా చుట్టేస్తుంది. శుక్రవారం (ఆగస్టు 18) సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్‌-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. ఆ తర్వాత 20న మరోసారి డీ-ఆర్బిట్‌-2 ప్రక్రియ చేపడుతారు.

 ఇక చంద్రుని మీద దిగడమే తరువాయి, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌, ప్రకటించిన ఇస్రో

ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రస్తుత కక్ష్యలో దాదాపు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ప్రయాణిస్తుందని ఇస్రో తెలిపింది. దీనిపైనున్న Spectro-polarimetry of Habitable Planet Earth (SHAPE) payload భూమి వాతావరణం యొక్క స్పెక్ట్రోస్కోపిక్ అధ్యయనం చేస్తుందని వివరించింది. అంటే కాంతి, ఇతర రేడియోధార్మిక కిరణాలను బయటకు పంపడం, వాటిని లోపలికి తీసుకోవడం గురించి అధ్యయనం చేస్తుంది. గాజు పట్టకంలోపలికి కాంతి వెళ్లడం, మళ్లీ దాని నుంచి బయటకు రావడాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.

భూమిపై మేఘాల నుంచి పోలరైజేషన్‌లో వైవిద్ధ్యాలను కూడా పరిశీలిస్తుందని ఇస్రో తెలిపింది. ప్రజలు నివసించడానికి అనువైన పరిస్థితులు సౌర మండలానికి వెలుపల ఉన్న నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహంలో ఉన్నాయేమో కూడా పరిశీలిస్తుందని తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన విక్రమ్ లాండర్ ఇక చంద్రునిపై తుది దశ ప్రయాణాన్ని ప్రారంభించిందని ఇస్రో వెల్లడించింది. ఇక దీనికి ప్రొపల్షన్ మాడ్యూల్ అవసరం ఉండదని చెప్పింది.

చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చందమామపై దిగే అవకాశం

చంద్ర‌యాన్‌-3 ప్రాజెక్టులో ఓ కీల‌క ఘ‌ట్టం ముగియడంతో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు సంబ‌రాల్లో తేలిపోయారు. ల్యాండర్‌ మాడ్యూల్‌ వేరు అయిన అనంతరం స్పేస్‌క్రాఫ్ట్‌ వేగాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది. అనంతరం స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్‌ (చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.మీ దూరం), అపోలూన్‌ (చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ దూరం) కక్ష్యలోకి ప్రవేశపెడతారు.

అనంతరం అడ్డంగా ఉన్న స్పేస్‌క్రాఫ్ట్‌ను నిలువుగా మార్చే ప్రక్రియను చేపడతారు. ఆ తర్వాత ఇదే కక్ష్య నుంచి ఆగస్టు 23న సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను చేయనున్నారు. ఆగస్టు 1న భూమి-చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్‌క్రాఫ్ట్‌ ఆగస్టు 5న లూనార్‌ ఆర్బిట్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా ఆగస్టు 6, 9, 14, 16న కక్ష్య తగ్గింపు ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసింది.

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన తర్వాత ల్యాండర్‌ మాడ్యూల్‌ సొంత పరిజ్ఞానంతో ముందుకు వెళ్తుందని చంద్రయాన్‌-1 ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేసిన డా. ఎం అన్నాదురై తెలిపారు. ‘ల్యాండర్‌ మాడ్యూల్‌లో నాలుగు ప్రధాన థ్రస్టర్లు ఉంటాయి. విడిపోయిన అనంతరం మొదటగా అందులో ఉండే థ్రస్టర్లు, సెన్సార్లను పరీక్షించాల్సిన అవసరం ఉంది. సొంత పరిజ్ఞానంతో 100x 30 కి.మీ కక్ష్యలోకి ల్యాండర్‌ చేరుకుంటుంది. ల్యాండర్‌ స్వయం ప్రతిపత్తితో పని చేస్తుంది. సాఫ్ట్‌ల్యాండింగ్‌ అయ్యేందుకు వీలుగా ల్యాండర్‌కు కమాండ్స్‌, సీక్వెన్స్‌, ఫెయిల్యూర్‌ మోడ్‌ ఐడెంటిఫికేషన్‌ తదితర అన్నింటిని అందులో ప్రొగ్రామ్‌ చేశారు. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న తెల్లవారుజామున సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

చంద్రయాన్‌-3 చివరి లూనార్‌ కక్ష్య తగ్గింపు విజయవంతం అవడంపై ఇస్రో మాజీ చైర్మన్‌ కె శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌-2 ప్రయోగం సమయంలో ఆయన ఇస్రో చైర్మన్‌గా వ్యవహరించారు. ఆగస్టు 23న చంద్రయాన్‌-3 చంద్రుడి ఉపరితలాన్ని తాకే గొప్ప క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని శివన్‌ పేర్కొన్నారు. గతంలో ప్రయోగించిన చంద్రయాన్‌-2 కూడా ఈ ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు. గతంలో ఎదుర్కొన్న వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. చంద్రయాన్‌-3 కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు.