US, Dec 26; యుఎస్‌ను బాంబ్ సైక్లోన్ (bomb cyclone) గజగజ వణికిస్తుంది. మంచు తుఫాను దెబ్బకి ప్రజలు విలవిలలాడుతున్నారు. గడ్డ కట్టే మంచుతో యుఎస్ నరకం చూస్తోంది. తాజాగా పుట్టినరోజు నాడు ఓ వ్యక్తి బయటకు వెళ్లి మంచులో గడకట్టి (Man found frozen to death in snow) ప్రాణాలు విడిచాడు. అతను కన్పించట్లేదని పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత కొన్ని గంటలకే మంచుదిబ్బలో అతని మృతదేహం దొరకడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని బఫెలోలో ఈ ఘటన జరిగింది.
చనిపోయిన వ్యక్తి పేరు విలియం క్లే(56) పోలీసులు గుర్తించారు. కాగా డిసెంబర్ 24న అతని బర్త్‌డే. ఆ మరునాడే క్రిస్మక్ కూడా కావడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. అయితే అమెరికాలో అప్పటికే మంచు తుఫాన్ కకావికలం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 24న ఇంటి దగ్గర ఉన్న ఓ దుకాణానికి విలియం వెళ్లాడు.అయితే చాలాసేపైనా తిరిగిరాలేదు.
దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే మంచులో ఓ శవం (frozen to death in snow) కన్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది విలియందేనని పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులు కూడా దీన్ని ధ్రవీకరించారు. పుట్టినరోజు నాడే తన తండ్రి చనిపోవడంతో విలియం కుమారుడు జూల్స్ క్లే కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక్కరోజు ముందే తండ్రితో చాలాసేపు మాట్లాడానని, ప్రేమిస్తున్నాని చెప్పానని బోరున విలపించాడు.
‘బాంబ్ సైక్లోన్’తో అమెరికాలో దారుణ పరిస్థితులు.. 34కు చేరిన మృతుల సంఖ్య
మరోవైపు విలియం సోదరి అతడు మరణించిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అతడి మృతదేహం వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. విలియంకు అంత్యక్రియలు నిర్వహించేందుకు విరాళాలు ఇవ్వాలని కోరింది. దాతలు వెంటనే స్పందించి 5,000 డాలర్లుకుపైగా(దాదాపు రూ.4లక్షలు) సమకూర్చారు.