Dubai Rains: దుబాయ్ ను ముంచెత్తిన వ‌ర‌ద‌లు, కొట్టుకుపోతున్న కార్లు, ఎయిర్ పోర్టు మూసివేత‌, ఒమ‌న్ లో 18 మంది మృతి, రెడ్ అల‌ర్ట్ జారీ (వీడియో ఇదుగోండి)
Dubai Rains

UAE, April 17: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్‌లో (Dubai Rains) భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు వీధులు, ఇళ్లు, మాల్స్‌ జలమయమయ్యాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

 

ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ వాతావరణ కేంద్రం దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని తెలిపింది. బుధవారం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

 

జాతీయ వాతావరణ కేంద్రం నిపుణుడు అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా. సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ (Submerged Cars) చేయాలని సూచించారు.

 

దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి మాట్లాడుతూ తుఫాను కారణంగా మంగళవారం మధ్యాహ్నం 25 నిమిషాల పాటు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశామని, ఆ తరువాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

 

మరోవైపు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్‌లో చిక్కుకుపోయారు.

 

భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా పాఠశాలలను మూసివేశారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది.