New Delhi, Feb 1: కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకకు పెద్ద పీట వేసింది.బడ్జెట్-2023లో (Union Budget 2023) వరాలు జల్లు కురిపించింది.అన్నిరాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకపై (poll-bound Karnataka) కరుణ చూపారు.కర్ణాటకలోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల కోసం రూ.5,300 కోట్ల కేటాయింపులు ఇస్తున్నట్లు (Centre likely to grant generous funds) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు.
అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ఈ కేంద్ర సాయం ప్రకటించారు. కరువుతో కొట్టుమిట్టాడుతున్న మధ్య కర్ణాటక ప్రాంతాలను ఆదుకునేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కర్ణాటక ప్రభుత్వం తుంగ భద్ర నదిపై గల భద్ర రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 17.40 టీఎంసీల నీటిని తరలించేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఇది ప్రాజెక్టును మరింత బలోపేతం చేస్తుందని, చిత్రదుర్గతో సహా మధ్య కర్ణాటకలోని అనేక వర్షాధార వ్యవసాయ జిల్లాలకు వరం అవుతుందని, పైగా.. ప్రాజెక్టును త్వరగా, సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని ఆమె పేర్కొన్నారు.
ఏప్రిల్-మే మధ్య కర్ణాటక సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్నికలు ప్రకటించారు. కర్ణాటకలో ప్రస్తుతం బస్వరాజ్ బొమ్మై సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ సారధ్యంలోని సెక్యులర్ జనతాదళ్ (జేడీఎస్) నుంచి అధికార బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటున్నది.
కర్ణాటకలో మరోసారి అధికారం దక్కించుకోవాలని యోచిస్తోంది.అందులో భాగంగానే ఈ వరాల జల్లులు కురిపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర సాయం ప్రకటించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై ధన్యవాదాలు తెలిపారు.