Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను విలయతాండవం, 100 అడుగుల మేర ముందుకు దూసుకువచ్చిన సముద్రం, రేపు తుఫాను తీరం దాటే వరకు అల్లకల్లోలంగా సముద్రం
Chennai Rains

బంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాను విలయతాండవం సృష్టించనుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరప్రాంత గ్రామాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. నిడుముసలి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. కృష్ణపట్నం పోర్టులో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కైవల్య, స్వర్ణముఖి, కాళంగి నదుల్లో నీటి ఉధృతి భారీగా పెరుగుతోంది. రెండు రోజుల్లో జిల్లాలో 5 సెం.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. నెల్లూరులో అత్యధికంగా 17 సెం.మీ, సిటీలో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాలతో 100 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి. దెబ్బతిన్న 1500 ఎకరాలకి సంబంధించిన నారుమళ్లు. వరి, వేరుశెనగ, శెనగ, మిర్చి, పండ్ల తోటల రైతులకి అపార నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు లైన్లు, కూలిన స్తంభాలు తెగిపడ్డాయి. అంధకారంలో పలు ప్రాంతాలు ఉండిపోయాయి. ఏపీలో విద్యా సంస్థలకి అధికారులు సెలవు ప్రకటించారు.

నేడు, రేపు స్కూళ్లకు సెలవు...నెల్లూరు, ప్రకాశం వైపు దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాను

‘మిచాంగ్’ తుఫాన్ (Michaung Cyclone) దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 220 కిలోమీటర్లు, బాపట్లకు 330 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.

Here's Videos

దీని ప్రభావంతో నేడు, రేపు కూడ కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురువనున్నాయి. రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు వీచనున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్.అంబేద్కర్ హెచ్చరించారు.

దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాన్...డిసెంబర్ 5న దక్షిణ ఆంధ్ర తీరాన్ని తాకనున్న తుఫాన్..రాబోయే 4 రోజులు భారీ వర్షాలు..

తుపాను ప్రభావం కారణంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి జోరున వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి తోడు బలంగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను సముద్ర తీర ప్రాంత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సముద్రం 10 మీటర్లు ముందుకు రావటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

మిచౌంగ్ తుఫాను ప్రభావంతో చెన్నై అంతటా వర్షాలు ప్రారంభమయ్యాయని, డిసెంబర్ 5 వరకు తీవ్రత మరింత పెరుగుతుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని చెంగల్‌పేట్, చాంచీపురం, తిరువళ్లూరుతోసహా ఇతర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా చైన్నైలోని పలు మెట్రో స్టేషన్ల వద్ద నీరు నిలిచిపోయింది. సెయింట్ థామస్ మెట్రో స్టేషన్‌లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో లోపలికి వెళ్లే మార్గం మూసుకుపోయింది. దీంతో ప్రయాణికులంతా ఆలందూరు మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కాలని అధికారులు సూచించారు.

వర్షం కారణంగా మెట్రో స్టేషన్‌ల వద్ద ఉండే ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో అదనపు నీరు నిలిచిపోయింది. దీంతో ఆ నీటిని బయటికి పంపుతున్నారు. నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ఉదయం 5 గంటలకు మెట్రో సేవలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. అయితే అనేక రహదారులు జలమయం కావడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కోరింది.