New Delhi, Nov 13: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. వాన నుంచి కాస్త ఉపశమనం పొందారనుకునే లోపే దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాసులు పోటీపడి పటాకులు కాల్చడంతో పొల్యూషన్ పెరిగింది. దీపావళి తర్వాత పరిస్థితులు మళ్లీ ప్రమాదకరంగా మారాయి. సుప్రీంకోర్టు (Supreme Court) నిషేధాన్ని కూడా పక్కనబెట్టి ఢిల్లీ వాసులు టపాసుల (firecrackers) మోత మోగించారు. దీంతో సోమవారం ఉదయం రాజధాని, దాని పరిసర ప్రాంతాలను కాలుష్య పొగ కమ్మేసింది.
ఇవాళ ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సగటు 286కు చేరింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ, ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 దాటింది. ఇతర ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉన్నది.
ఆదివారం రాత్రి పటాకులు కాల్చడంతో సోమవారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాలపై దట్టమైన విషపూరిత పొగమంచు కమ్మింది. పండుగరోజైన ఆదివారం ఉదయం 202గా ఉన్న ఢిల్లీ యావరేజ్ ఏక్యూఐ, ఇవాళ ఉదయం 286కు పెరిగింది. రహదారులపై కమ్ముకున్న దుమ్ముధూళి కారణంగా విజుబిలీటీ బాగా తగ్గిపోయింది. 50 మీటర్ల దూరం కూడా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాగా నగరంలో వాహనాల రద్దీ పెరగడం, పంజాబ్‌లో పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఎయిర్ పొల్యూషన్ పెరుగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగనాడు పటాకులు కాలిస్తే కాలుష్యం మరింత తీవ్రమవుతుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పండుగరోజు ఢిల్లీ నగరంలో పటాకులు కాల్చడంపై నిషేధం విధించింది.
Here's Videos
#WATCH | Light haze shrouds Agra's Taj Mahal; overall air quality in 'moderate' category pic.twitter.com/7J8XFPa6th
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 13, 2023
#WATCH | Uttar Pradesh: Air Quality in Ghaziabad deteriorates to 'Poor' category, as per the Central Pollution Control Board (CPCB).
(Drone visuals from Ghaziabad area, shot at 7.00 am) pic.twitter.com/x9gKtfkpEj
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 13, 2023
గత వారాంతంలో ఢిల్లీ (Delhi)లో మోస్తరు వర్షాలు కురవడంతో వాయు నాణ్యత (AQI) సూచీ కాస్త మెరుగుపడింది. ఆదివారం సాయంత్రం వరకూ ఏక్యూఐ 218గానే నమోదైంది. కానీ, ఆ తర్వాత దీపావళి పండగను పురస్కరించుకుని దిల్లీ వాసులు బాణసంచా పేల్చారు. దీంతో సోమవారం ఉదయానికి ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ క్షీణించింది.
ఈ ఉదయం చాలా చోట్ల ఏక్యూఐ సూచీ 500 దాటగా.. లజ్‌పత్ నగర్‌లో వాయు నాణ్యత సూచీ ఏకంగా 959కి పడిపోయింది. జవహర్‌లాల్ నెహ్రూ నగర్‌లో 910, కరోల్ బాఘ్‌లో 779గా ఉంది. ఊపిరితిత్తులను పాడుచేసే అతిసూక్ష్మ ధూళికణాలుగా పేర్కొనే పీఎం2.5 కణాల సాంద్రత 24 గంటల్లోనే 140శాతం పెరిగింది. ఆదివారం ఉదయానికి ఈ సాంద్రత సగటున క్యూబిక్ మీటర్‌కు 83.5గా ఉండగా.. ఈ ఉదయానికి అది 200.8కి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గణాంకాలు వెల్లడించాయి.
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో ప్రజలు నిన్న రాత్రి విపరీతంగా బాణసంచా పేల్చడమే ఈ పరిస్థితికి కారణమైందని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిషేధాన్ని అమలు చేయడంలో ఢిల్లీ అధికారులు విఫలమయ్యారని దుయ్యబడుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యవంతమైన నగరాల జాబితాలో ఢిల్లీ అగ్ర స్థానంలో ఉంది.ఎయిర్ క్వాలిటీ సూచిక 196గా నమోదైన కోల్‌కతా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ క్వాలిటీ సూచిక 163గా నమోదైన ముంబై ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఏక్యూఐ సూచిక 400 నుంచి 500 మధ్య నమోదైతే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు. ఈ స్థాయిలో ఉండే వాయు కాలుష్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది.
ఇప్పటికే ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ సూచిక 150 నుంచి 200 మధ్య నమోదైతే అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశాలుంటాయి. ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే మాత్రమే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
దీపావళి రోజున జరిగిన చిన్న, మధ్యతరహా, తీవ్రమైన అగ్నిప్రమాదాలకు సంబంధించి ఇప్పటివరకు 208 ఘటనలు చోటుచేసుకున్నాయని డిపార్ట్‌మెంట్ హెడ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఢిల్లీలోని సదర్ బజార్, ఈస్ట్ ఆఫ్ కైలాష్, తిలక్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం రాలేదు.
అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సెంట్రల్ ఢిల్లీలోని సదర్ బజార్‌లోని డిప్యూటీ గంజ్ మార్కెట్‌లోని గోదాములో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు 22 అగ్నిమాపక శకటాలు శ్రమించాయి. దాదాపు 2 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. గోదాములో ఉంచిన వస్తువులన్నీ దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేరకు నష్టం జరిగిందన్న సమాచారం అందుబాటులో లేదు.
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్కెట్‌లోని కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుతైనట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్‌కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.