Ladakh, August 31: చైనా తన బుద్ధిని మార్చుకోవడం లేదు. పదే పదే బార్డర్ వద్ద అలజడిని రేపేందుకు ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు అదేపనిగా పాల్పడుతోంది. తాజాగా భారత్‌ను మరోసారి రెచ్చగొట్చేందుకు చైనా (India-China Border Tensions) ప్రయత్నించింది. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద దూకుడుగా తన ఆర్మీ కదలికను ప్రోత్సహిస్తూ అక్కడ యథాతథ స్థితిని మార్చే ప్రయత్నం చేసిందని భారత ఆర్మీ సోమవారం ప్రకటించింది. ఆగస్టు 29 ఆర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే తాము చైనా ఆటలు సాగనీయలేదని వారన్నారు.
ఇప్పటివరకూ సరస్సుకు ఉత్తరాన ఉన్న ప్రాంతానికే ఉద్రిక్తలు పరిమితమయ్యాయి. తాజాగా సరస్సుకు దక్షిణాన ఉన్న సరిహద్దును (Southern Bank of Pangong Tso Lake )ఉల్లఘించేందుకు చైనా ప్రయత్నించిందని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సరిహద్దుల్ని మార్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ కూడా తలెత్తినట్లు సమాచారం. ఘర్షణ జరిగినట్లు మాత్రం ఆర్మీ ప్రకటించలేదు. కేవలం రెచ్చగొట్టేందుకు యత్నించినట్లు మాత్రమే తెలిపింది. గాల్వన్ వ్యాలీ ఘర్షణ, బయటపడిన చైనా సైనికుని సమాధి
ఈ నేపథ్యంలోనే చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చింది. డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. ‘చైనా ఆర్మీ కదలికలను ముందుగానే గుర్తించి మేము పటిష్ట చర్యలను తీసుకున్నాం. ఏకపక్షంగా యథాతథస్థితిని మార్చాలనుకున్న చైనా వ్యూహాన్ని భగ్నం చేశాం’ అని భారత్ ఆర్మీ పీఆర్‌ఓ కల్నల్ ఆమన్ ఆనంద్ మీడియాకు తెలిపారు. ‘చర్చల ద్వారా శాంతిని నెలకొల్పేందుకు భారత్ కట్టుబడి ఉంది. అదే స్థాయిలో.. తన సమగ్రతను కాపాడుకునేందుకు భారత్ పోరాడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి’ అని ఆయన తెలిపారు. 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?
ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది. తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన తొలగాలంటే ఇరు దేశాలకు పరస్పర ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవాలని భారత్ గత వారమే స్పష్టం చేసింది. గతంలో వెలుగు చూసిన వివాదాలన్ని చర్చల ద్వారానే పరిష్కారమయ్యాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. పరిస్థితి పూర్తిగా కుదుటపడాలంటే.. ఇరు దేశాలూ తమ సైన్యాన్ని మునుపటి సాధారణ సైనిక స్థావరాలకు పరిమితం చేయాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అప్పట్లో తేల్చిచెప్పారు.
కాగా గల్వాన్ లోయలో జూన్ 15న ఘాతుకానికి పాల్పడిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 20 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు దఫాలుగా దౌత్యపరమైన, మిలిటరీ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేందుకు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దశల వారీగా బలగాలను రప్పించాలనే ఒప్పందానికి తూట్లు పొడిచిన చైనా ఆర్మీ ఆగష్టు 29, 30 తేదీల్లో తూర్పు లదాఖ్, ప్యాంగ్ యాంగ్ సరస్సు వద్ద స్టేటస్ కోను మార్చే ప్రయత్నాలు చేసిందని భారత రక్షణ శాఖ వెల్లడించింది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, 20 మంది భారత జవాన్లు, 40 మంది చైనా సైనికులు మరణం
పాంగాంగ్ వద్ద వివాదం అసలు కథ
పాంగాంగ్ సరస్సు లద్దాఖ్‌లో ఉంది. దాదాపు 134 కిలోమీటర్ల పొడవున్న ఈ సరస్సు టిబెట్ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సరస్సు దాదాపు 60శాతం టిబెట్ పరిధిలో ఉంటుంది. 1962లో చైనా దాడి చేసి ఆక్సాయిచిన్‌ను దక్కించుకొంది. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దులుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ ఈ సరస్సుమీద నుంచి పోతుంది. ఇరు దేశాలు కచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ధారించుకోలేదు. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు ‘ఫింగర్స్’గా అభివర్ణిస్తాయి.
ఈ ఫింగర్ దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. భారత్ ‘ఫింగర్ 8’ నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంది.. భౌతికంగా మాత్రం ఫింగర్ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యంకు ఫింగర్ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది.. అయినా ఫింగర్ 2 వరకు తమదే అని వాదిస్తోంది. ప్రస్తుతం భారత్ సైన్యాన్ని ఫింగర్2 వద్దే ఆపేస్తోంది. సరస్సులో కూడా భారత్ చైనాల మధ్య వివాదం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సరస్సులో భారత దళాలు పెట్రోలింగ్ చేస్తుంటే చైనా దళాలు మరబోట్లు వేసుకొని వచ్చి అడ్డుకొన్నాయి. దీంతో భారత్ కూడా టాంపా రకం బోట్లను ఇక్కడ వినియోగించడం మొదలుపెట్టింది. ఇటీవల పాంగాంగ్ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో చైనా ఎల్‌ఎక్స్ రకం బోట్లను తీసుకొచ్చింది.