New Delhi, June 17: గాల్వన్ లోయలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితులపై (India-China Border Tensions) అమెరికా స్పందించింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్-చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులును (India-China Tension) నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా (America) ప్రకటించింది. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయారనే విషయం మా దృష్టికి వచ్చిందని, అమర జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని అమెరికా ప్రతినిధి చెప్పారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత సమస్య శాంతియుత పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు. భారత్, చైనా సరిహద్దు సమస్యపై జూన్ 2న భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో చర్చించారని వెల్లడించారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, 20 మంది భారత జవాన్లు, 40 మంది చైనా సైనికులు మరణం, ప్రధానితో రక్షణమంత్రి అత్యవసర భేటీ
కాగా లఢక్‌లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో (India-China Clash In Galwan) 20 మంది భారత సైనికులు మరణించారు. 43 మంది చైనా సైనికులు మరణించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. గాల్వాన్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికులు రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో భారత కమాండింగ్ ఆఫీసర్ సహా 20 మంది సైనికులు మరణించినట్లు సైన్యం ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దుల్లో సైనికులు మృతి చెందడం (Indian and Chinese troops) 1975 తర్వాత.. అంటే నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని టులుంగ్ లా వద్ద నలుగురు భారతీయ సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఆయుధాలు వాడలేదని సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి
నెలన్నర ఉద్రిక్తతల అనంతరం వాస్తవాధీన రేఖవెంబడి ఇరు పక్షాలు వెనుకకు తగ్గుతున్న సమయంలో సోమవారం మళ్లీ ఘర్షణ తలెత్తింది. ఇరు దేశాల సైనికులు రాత్రి రాళ్లు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో భారత కమాండింగ్ ఆఫీసర్ సహా 20మంది సైనికులు మరణించారని సైన్యం ప్రకటించింది. ఈ ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విదేశాంగమత్రి జైశంకర్, త్రివిధ దళాధిపతులు, సీడీఎస్ బిపిన్ రావత్‌తో సమీక్షించారు. అనంతరం తాజా పరిస్థితిని ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్లో వివరించారు.
గాల్వన్ ఘర్షణతో భారత్ అప్రమత్తమైంది. లడఖ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసింది. అంతకుముందు, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ, గాల్వన్ లోయ ప్రాంతాల్లో భారత బలగాల సంఖ్యను భారీగా పెంచాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఆ తరువాత, జై శంకర్, ఆర్మీ చీఫ్ నరవణెలతో రాజ్‌నాథ్ మళ్లీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం పఠాన్‌కోట్ పర్యటనను ఆర్మీ చీఫ్ రద్దు చేసుకున్నారు.
మరోవైపు, హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో సమావేశమై చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు.చైనాలో భారత రాయబారి విక్రం మిస్తీ, ఆ దేశ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని విదేశాంగశాఖ ప్రతినిధి ప్రకటించారు. మరోవైపు గాల్వన్ లోయ తమదేనని, ఎప్పటికీ చైనా సార్వభౌమత్వంలోనే ఉంటుందని ఆ దేశ సైన్యం ప్రకటించింది.
మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దులకు భారీగా బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించాయి. పలుమార్లు రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగి, గాయాల పాలయ్యారు. అనంతరం, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మేజర్ జనరల్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి.
భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు భారత్–చైనా చర్యలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
కొంతకాలంగా భారత సరిహద్దుల్లో చైనా తన సైన్యాన్ని పెంచుతూ తీవ్ర ఉద్రిక్తతలను సృష్టిస్తున్నది. లఢక్‌లోని గాల్వాన్ లోయ, ప్యాంగాంగ్ సో సరస్సు, డెమ్‌చోక్, దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖను (ఎల్‌ఏసీ) దాటి భారత భూభాగాన్ని ఆక్రమించటంతో భారత సైన్యం దీన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ నెల 6 సైనిక జనరళ్ల స్థాయిలో చర్చలు జరిగిన అనంతరం గాల్వాన్, తూర్పు లఢక్ మినహా ఇతర ప్రాంతాల్లో ఇరు సైన్యాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి.
సోమవారం గాల్వాన్, ప్యాంగాంగ్ సో ప్రాంతాల్లో బ్రిగేడ్ కమాండర్ల స్థాయి చర్చల అనంతరం గాల్వాన్‌లో లోయలో సైన్యాలను ఉపసంహరించుకుంటున్న సమయలో సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని భారత సైనిక అధికారులు తెలిపారు. చైనా సైనికులు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని భారత సైన్యం చెప్తుండగా, భారత సైనికులే సరిహద్దు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించి ఘర్షణ పడ్డారని చైనా ఆరోపించింది.
చైనాతో ఉన్న సరిహద్దు వెంట ఇటీవల భారత ప్రభుత్వం భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నది. అక్కడ అత్యవసర పరిస్థితి ఎదురైతే బలగాలను సరిహద్దులకు త్వరగా తరలించేందుకు రోడ్లు, వైమానిక స్థావరాల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఇది చైనాకు మింగుడుపడటం లేదు.
అయితే 1962లో భారత్-చైనా మధ్య జరిగిన యుద్ధం తరువాత చైనా జీ219 రోడ్డుకి బీజం వేసింది. తమ దేశంలోని జిన్‌జియాంగ్ నుంచి టిబెట్‌కు చైనా 179 కిలోమీటర్ల పొడువుతో ఈ రోడ్డు నిర్మించింది. అయితే, ఈ మార్గం భారత్‌లోని అక్సాయి చిన్ ప్రాంతం గుండా పోతున్నది. భారత్ సమ్మతి తీసుకోకుండానే చైనా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. ఆ తర్వాత రోడ్డు మార్గం ఉన్న ప్రాంతమంతా తమదేనని ప్రకటించింది. యుద్దం ముగిసిన తర్వాత మరికొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించింది.
ఈ నేపథ్యంలో భారత్ కూడా కూడా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసుకుంది. గాల్వాన్ నది పరీవాహక ప్రాంతాల్లో ఎల్‌ఏసీ అతి తక్కువ ఎత్తులో ఉండటంతో ఇండియా తన బలగాలను అక్కడ మొహరించింది. ఈ లోయ గుండా భారత బలగాలు సులభంగా అక్సాయి చిన్ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇది చైనాకు కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో తూర్పు లఢక్‌లోని గాల్వాన్ లోయ ప్రాంతంపై తన పట్టును నిలుపుకోవాలని చైనా ప్రయత్నిస్తున్నది. గాల్వాన్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో తన దళాలను మోహరించేందుకు ప్రయత్నిస్తున్నది.