Hands Transplant Surgery (PIC@ DD News X)

New Delhi, March 07: అత్యంత అరుదైన సర్జరీ.. దేశ రాజధానిలోని ఢిల్లీలో సర్‌గంగారామ్ ఆస్పత్రి వైద్యులు అద్భుతం (Rare Transplant Surgery) చేసి చూపించారు. రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి చేతి మార్పిడి శ‌స్త్ర చికిత్స (Hands Transplant) ద్వారా విజయవంతంగా తిరిగి అమర్చారు. వైద్యాశాస్త్రంలోనే ఇదో అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు. 45 ఏళ్ల వ్యక్తికి అరుదైన చేతి మార్పిడి చికిత్సతో రెండు చేతులను అతికించారు వైద్యులు. తద్వారా ఆ వ్యక్తి జీవితంలో కొత్త వెలుగులను నింపారు. దాదాపు 6 వారాల పాటు ఆసుపత్రిలోనే గడిపిన ఆ వ్యక్తి త్వరలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నాడు. ఢిల్లీకి చెందిన 45ఏళ్ల రాజ్ కుమార్ వృత్తిరీత్యా పెయింటర్‌. 2020లో జరిగిన రైలు ప్రమాదంలో రాజ్‌కుమార్ (Rajkumar) తన రెండు చేతులను కోల్పోయాడు. నాంగ్లోయ్‌లో నివాసముంటున్న పెయింటర్ సైకిల్‌పై తన ఇంటికి సమీపంలోని రైల్వే ట్రాక్‌ దాటుతుండగా అదుపు తప్పి పట్టాలపై పడ్డాడు. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొనడంతో ప్రమాదవాశాత్తూ తన రెండు చేతులను కోల్పోయాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతడు నిరుపేద కావడంతో తన జీవితంపై ఆశలు వదిలేసుకున్నాడు.

 

తన రోజువారీ కార్యకలాపాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. ఇక తనకు జీవితమే లేదని బాధపడుతున్న రాజ్ కుమార్‌కు సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఓ స్కూల్ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ బ్రెయిన్ డెడ్‌ అయ్యారు. ఆమె మరణానంతరం తన అవయవాలను దానం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. దాంతో ఆమె రెండు చేతులనే పెయింటర్ రాజ్‌కుమార్‌కు చేతి మార్పిడి సర్జరీ ద్వారా అమర్చారు.

రాజ్ కుమార్‌కు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. అందులో ప్రోస్తేటిక్స్ లేదా చేతి మార్పిడి మాత్రమే. అయితే ముందుగా ప్రోస్తేటిక్స్ ఉపయోగించగా కృత్రిమ ట్రయిల్ విజయవంతం కాలేదు. అతని ఏకైక ఆశ చేతి మార్పిడి మాత్రమే.. అయితే ఆ సమయంలో చేతి మార్పిడి చేసేందుకు ఉత్తర భారతదేశంలోని ఏ కేంద్రానికీ అనుమతి లేదని మెడికల్ ఫెసిలిటీ ప్లాస్టిక్, కాస్మెటిక్ సర్జరీ విభాగం ఛైర్మన్ డాక్టర్ మహేష్ మంగళ్ పేర్కొన్నారు.

Bengaluru Water Crisis: బెంగుళూరు వాసులకు చుక్కలు చూపిస్తున్న నీటి కొరత, మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయిందని తెలిపిన డిప్యూటీ సీఎం డికె శివకుమార్ 

చేతి మార్పిడి కోసం అవయవదానం చేసేవారిని వెతుకుతున్నప్పుడు కుమార్ మా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడని ఆయన తెలిపారు. మార్పిడి ప్రోటోకాల్‌ల ప్రకారం.. వివరణాత్మక పరీక్ష, అవసరమైన పరిశోధనలు జరిగాయి. గత జనవరి మూడో వారంలో రాజ్ కుమార్‌కు ఆస్పత్రి నుంచి కాల్ వచ్చిందన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే సర్ గంగారామ్ హాస్పిటల్, చేతి మార్పిడికి అనుమతి పొందిన ఉత్తర భారతదేశంలో మొదటి ఆసుపత్రిగా అవతరించింది. జనవరి 19న సర్జరీ వైద్యుల బృందం ఎముకలు, ధమనులు, సిరలు, స్నాయువులు, కండరాలు, నరాలు, చర్మం వంటి వివిధ భాగాలతో అనుసంధానం చేశారు. ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియను అమలు చేయడానికి వైద్యులు ఎన్నో గంటలు శ్రమించారు. చివరికి రాజ్ కుమార్ శరీరానికి రెండు చేతులను అమర్చడంలో విజయం సాధించారు.