Delhi Services Bill: ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం మాకుందంటూ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా, రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మండిపడిన ప్రతిపక్షాలు
పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023’ (The Government of National Capital Territory of Delhi Bill 2023) బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ప్రవేశ పెట్టారు.
New Delhi, August 1: పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు వచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023’ (The Government of National Capital Territory of Delhi Bill 2023) బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సభలో ప్రవేశ పెట్టారు. బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఆర్‌ఎస్‌పీ సైతం ప్రకటించింది.
ఈ సందర్భంగా ఢిల్లీకి సంబంధించిన ఏ చట్టాన్నైనా రూపొందించే అధికారాన్ని లోక్ సభకు రాజ్యాంగం కల్పించింది’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాగా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని కాంగ్రెస్ మండిపడగా.. ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల రగడతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
కాగా ఢిల్లీ పరిపాలనను తమ కంట్రోల్ లోనే ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దేశ రాజధానిలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సేవలపై నియంత్రణ విధిస్తూ కేంద్రం ఓ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్‌కి సంబంధించిన బిల్లును మంగళవారం లోక్ సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లు లోక్‌సభలో పాస్ అయితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో విపక్ష ఇండియా కూటమి పార్టీలు కేజ్రీవాల్ కు అండగా నిలిచాయి.
గతంలో దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను గవర్నర్ కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీన్ని ఢిల్లీ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు కేజ్రీవాల్ కు మద్దతు తెలిపాయి. మరోవైపు కేంద్రం ఆర్డినెన్స్ పై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న కీలక తీర్పు ఇచ్చింది . పోలీస్, పబ్లిక్ ఆర్డర్, భూ వ్యవహారాలు మినహా ఢిల్లీలోని మిగతా అన్ని శాఖలు, విభాగాలు, సేవల నియంత్రణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేసింది.
(The above story first appeared on LatestLY on Aug 01, 2023 05:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

