New Delhi, July 25: భారత దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu) పదవీ బాధ్యతలను చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ఇవాళ జాతిని ఉద్దేశించి (President Draupadi Murmu address to the nation) ప్రసంగించారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నికకావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. భారత్ స్వాతంత్య్రం సాధించిన తర్వాత పుట్టిన తొలి రాష్ట్రపతిని తానే అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు ఆశయాలకు తగినట్లు అభివృద్ధిలో వేగం పెంచాలన్నారు.మీ నమ్మకం, మద్దతు బాధ్యతల్ని నిర్వర్తించేందుకు తనకు శక్తినిస్తుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు ఆశయాలకు తగినట్లు అభివృద్ధిలో వేగం పెంచాలన్నారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ బాధ్యతలు, ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీ రమణ
ఒక ఆదివాసీ గ్రామంలో పుట్టిన తాను రాష్ట్రపతి భవన్ వరకు రావడం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని... దేశంలోని పేద ప్రజలందరికీ దక్కిన విజయమని ద్రౌపది ముర్ము చెప్పారు. ఈ దేశంలో పేదలు కూడా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే ఒక నిదర్శనమని అన్నారు. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ తన రాజకీయ జీవితం ప్రారంభమయిందని... 75 ఏళ్ల వేడుకల వేళ దేశ అత్యున్నత పదవికి ఎన్నికయ్యానని... తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. దేశంలో అందరికీ ప్రాథమిక విద్య అందాలనేది తన ఆకాంక్ష అని ముర్ము తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతిపై దృష్టి సారిస్తానని చెప్పారు. యువతను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ... వ్యక్తిగత జీవితంలో ఎదుగుతూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. యువతకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు.
రాష్ట్రపతి పోస్టును చేరుకోవడం తన వ్యక్తిగత ఘనతగా భావించడం లేదని, ఇది భారత్‌లో ఉన్న ప్రతి పేదవాడి అచీవ్‌మెంట్ అని, తాను రాష్ట్రపతిగా నామినేట్ అవ్వడం అంటే, దేశంలో పేదలు కలలు కనవచ్చు అని, వాళ్లు ఆ కలల్ని నిజం చేసుకోవచ్చు అని రుజువైందన్నారు. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న పేదలు, దళితులు, వెనుకబడినవాళ్లు, గిరిజనులు, తనను ఆశాకిరణంగా చూడవచ్చు అన్నారు. తన నామినేషన్ వెనుక పేదల ఆశీస్సులు ఉన్నాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. కోట్లాది మహిళల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు.
2015లో ఝార్ఖండ్ గవర్నర్ గా ద్రౌపది ముర్ము పని చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కేబినెట్ లో ఆమె రాష్ట్ర మంత్రిగా పని చేశారు. అప్పట్లో బీజేపీ మద్దతుతో బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సాధారణ క్లర్క్ గా జీవితాన్ని ప్రారంభించిన ముర్ము... అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించడం అందరికీ గర్వకారణం.