Bangalore, April 28: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విషసర్పం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలు ఇటీవల కలకలం రేపాయి. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే మరో వివాదానికి తెరలేపారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi)ని విషకన్య అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ (Basanagouda Yatnal ) వివాదాస్పద వ్యాఖ్య చేశారు. తాజాగా ఓ సభలో పాల్గొని మాట్లాడుతూ సోనియా గాంధీని ఆయన విషకన్యగా అభివర్ణించారు. ప్రధాని మోదీ సమర్థతను ప్రపంచం మొత్తం అంగీకరించిందని బసనగౌడ అన్నారు. ఒకప్పుడు మోదీకి అమెరికా వీసా నిరాకరించిందని, అనంతరం రెడ్ కార్పెట్ వేసి మోదీకి ఆహ్వానం పలికిందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం మోదీని పాముతో పోల్చుతోందని, విషాన్ని కక్కుతారని అంటోందని అన్నారు. మరి సోనియా గాంధీ విషకన్యనా అని ప్రశ్నించారు. ఆమె చైనా, పాకిస్థాన్ తో కలిసి వారి ఏజెంటుగా పనిచేశారని ఆరోపించారు.
#WATCH | While attacking Congress President Mallikarjun Kharge over his 'poisonous snake' remark on PM Modi, Karnataka BJP MLA Basanagouda Yatnal calls UPA chairperson Sonia Gandhi 'Vishkanya'
(27.04) pic.twitter.com/ZqMBHbudST
— ANI (@ANI) April 28, 2023
దీంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. “ఓ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఇవాళ సోనియా గాంధీని విషకన్య అని అన్నారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందన ఏంటో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు” అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘెల్ మండిపడ్డారు.
మోదీని విషసర్పం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కూడా భూపేష్ భఘెల్ స్పందించారు. దీనిపై ఇప్పటికే మల్లికార్పున ఖర్గే స్పష్టత ఇచ్చారని, బీజేపీ భావజాలాన్ని విషసర్పం అన్నానని ఖర్గే చెప్పారని భూపేష్ భఘెల్ గుర్తు చేశారు. ఇటువంటి స్పష్టత ఇస్తూ ఖర్గే ప్రకటన చేయడం ఆయన గొప్పదనంగా భఘెల్ అభివర్ణించారు.
మోదీపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కూడా బీజేపీ నేతలు ఇటీవల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలను ఇటువంటి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర మంత్రి స్పృతీ ఇరానీ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని తాను ఎన్నడూ ఊహించలేదని, ఖర్గే క్షమాపణలు చెప్పాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప అన్నారు.