Telangana Liberation Day 2020:  విలీనమా.. విమోచనమా? తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్, తెలంగాణ ప్రాంతంలో ఈరోజుకున్న విశిష్టత తెలుసుకోండి
September 17 - National Flag Hoist at Telangana Bhavan | Photo : Twitter

Hyderabad, September 17:   1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు, కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం అప్పటికీ నిజాం పాలనలోనే ఉండింది. బ్రిటిష్ వారికి సామంతుడిగా వ్యవహరించిన హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో గానీ, ఇటు పాకిస్తాన్ లో గానీ కలవకుండా స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. నిజాం నవాబు మాత్రం అటు పాకిస్థాన్ సహాయం కోరడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించించాడు, దీంతో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రిగా వ్యవహరించిన 'సర్ధార్' వల్లభాయి పటేల్ హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య ఆపరేషన్ పోలో నిర్వహించారు. ఈ చర్యతో తన లొంగుబాటును ప్రకటించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలిపేందుకు అంగీకరించాడు. తదనంతర పరిణామాలతో 1948, సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం అయింది, ఈ విధంగా హైదరాబాద్ రాష్ట్రం అవతరించింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా, నిజాం పాలను అంతమొందిన సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా చెప్తారు. అయితే అది విమోచనం కాదు, భారతదేశంలో విలీనమైన రోజు మాత్రమే అని మరొక 'రాజకీయ' వాదన.

ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి అంటూ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు ప్రతీఏడాది ఈ సమయానికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తమది సెక్యులర్ విధానం అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచనం కాదు విలీనం అని చెబుతూ అధికారికంగా నిర్వహించేందుకు విముఖంగా ఉంది. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా అనధికారికంగా ఈరోజు జాతీయ జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఈరోజు తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. అయితే తెలంగాణ విమోచనం లేదా విలీనం  అని ఎలాంటి ప్రస్తావన చేయలేదు. 'సెప్టెంబర్ 17' సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్' అని ట్వీట్ ద్వారా పేర్కొంది.

Here's the tweet:

చరిత్రలో ఉన్న రికార్డులు, పలు నివేదికల ప్రకారం హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాదు సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం ఆ స్వేచ్ఛా ఫలాలు అందకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్య్రోత్సవాలతో ప్రజలు సంబరంగా గడుపుతుంటే నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. నిజాం నవాబు అండదండలతో ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం నానా అరాచకాలు సృష్టించారు. ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు.

ఈ క్రమంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులు.

రచయితలు, ఉద్యమకారులతో  విమోచనోద్యమం 1948లో ఉధృతరూపం దాల్చింది.  చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 18న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.