Chhatrapati Shivaji Maharaj: ఛత్రపతి శివాజీ గురించి ఎవరికీ తెలియని నిజాలు, భరత జాతి వీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరుడు, మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ పుట్టినరోజుపై ప్రత్యేక కథనం
Shivaji Maharaj Jayanti 2020 HD Image And Wallpaper (Photo Credits: File Image)

Mumabi, Febuary 19: భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు.. మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి.. మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింప చేసిన వీరుడు యువతరం గుండెల్లో ఎప్పటికీ పౌరషాగ్నిని రగిలించే దిక్సూచి.. అతడే చత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Maharaj).

స్వరాజ్య కాంక్షను రగిలించి చరిత్ర పుటల్లో సువర్ణాధ్యాయంగా నిలిచిన మరాఠా యోధుడు. ఈ పేరు వింటే హిందూ మతం పులకించిపోతుంది. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. నేడు ఆయన పుట్టినరోజు (Chhatrapati Shivaji Maharaj Jayanti) ..ఈ సంధర్భంగా కొన్ని విషయాలను గుర్తు చేసుకుందాం.

భారతదేశంపై దండెత్తిన మొఘలు రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేశారు. ఈ ఓటమితో మన దేశంలో హిందూ దేశం అంతరించిపోతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పుడే కటిక చీకటి నుండి నిప్పుకణికలా ఛత్రపతి శివాజీ మహారాజ్ దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి ఆ దాడిని సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. 17వ ఏటలోనే యుద్ధ భూమిలోకి అడుగు పెట్టి మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.

భారత గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం

క్రీస్తు శకం 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఉన్న జునార్ లోని శివనీర్ కోటలో జిజియాబాయి, షహాజీ దంపతులకు శివాజీ రాజే భోంస్లే (Shivaji Bhonsle) అలియాస్ శివాజీ జన్మించారు. శివాజీ మహారాజ్ (Shivaji Maharaj) తన తల్లి దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటాన్ని నేర్చుకున్నాడు. అంతేకాదు అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమిపైన, ప్రజలతో ఎలా మెలగాలో శివాజీకి తన తల్లి జిజియాబాయి నేర్పించింది.

ఆయన తండ్రి పూనేలోనే జాగీరుగా ఉండేవారు.శివాజీ తన తండ్రి దగ్గర నుండి యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. అలాగే రాజనీతి మెళకువలను నేర్చుకుంటూ తన తండ్రి పరాజయాలన్నీ కూడా అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధతంత్రాలను నేర్చుకొన్నాడు. ఇలా యుద్ధానికి సంబంధించిన అన్ని మెళకువలను నేర్చుకున్నాడు. అనంతరం తను 17వ సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కత్తి పట్టాడు. కేవలం వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్ కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజ్ ఘడ్ కొండను కూడా ఛేజిక్కించుకుని పూనే ప్రాంతాన్ని అంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

70 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం

వరుసగా శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసిన ముస్లింరాజు ఆదిల్షా శివాజీ తండ్రి షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. ఈ ఘటనతో ఖంగుతిన్న ఆదిల్షా అఫ్జల్ ఖాన్‌ సాయం కోరాడు. శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. అప్పుడే ప్రతాప్ ఘడ్ యుద్దం జరిగింది.

ప్రతాప్‌ఘడ్ యుద్ధం

శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు.

అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను, శివాజీ సైన్యాధికారులు అడ్డుకోనగా, శివాజీ తనపై దాడి చేసాడు. దీంతో అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా, ఒకే వేటుకు శివాజీ, అఫ్జల్ ఖాన్ ను చంపేసారు. ఇక్కడ చేతికి పులి గోర్లు కూడా వేసుకున్నారని కూడా చరిత్రకారులు చెబుతారు. ఆప్జల్ ఖాన్ మరణం తరువాత సహించలేని ముస్లీం రాజులు మళ్లీ దండయాత్రకు సిద్ధమయ్యారు.

కొల్హాపూర్ యుద్ధం

ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ ' అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు.

సుల్తానులతో శివాజీ ఆఖరి యుద్ధం

రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్‌హాలా కోటలో శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ ఎలాగయినా పన్‌హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్‌ఘడ్ కోటకు చేరుకొంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు.

కానీ అప్పటికే పన్‌హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్దంగా లేనని దయతలచవలసినదిగా సిద్ది జోహార్‌కు వర్తమానం పంపాడు. అది తెలుసుకొన్ని సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకొంటుంటే, శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోటవైపు పయనించసాగాడు.

చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు. కోటకు చేరుకొనేలోపు శత్రువులు తమను సమీపించగలరు అన్ని విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్‌పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలసి తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామని, శివాజీని తన అంగరక్షకులతో ఎలాగయినా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశ్‌పాండే రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది.

మొఘలులతో యుద్ధాలు

1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్‌కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్‌లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు.

సూరత్ యుద్ధం

1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమయిన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. శివాజి మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.

మైసూరు పులి వీరోచిత చరిత్ర ఎంతమందికి తెలుసు

సింహగఢ్ యుద్ధం

శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా, పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్‌భాన్ రాథోడ్ అనే రాజపుతృడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చెసుకొనే బాధ్యత అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది.

ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు. మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ 'కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము ' అన్నాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహఘడ్‌గా మార్చాడు.

చివరి రోజులు

జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.

ఓటమి తప్పదు అనిపిస్తే.. యుద్ధం నుండి తప్పుకోవాలి.. అనుకూల సమయాన్ని చూసుకుని దాడి చేసి గెలవాలి ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారు. ముస్లిం దురాక్రమణదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాలను నుంచి హిందువులుగా మారిన వారిని గౌరవించేవాడు. అంతే కాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు. హిందూ మతాన్ని కాపాడటం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు. అందుకే చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించారు.