IND Vs SA 1st ODI (PIC@ BCCI X)

Johannesburg, DEC 17: భారత్‌ – దక్షిణాఫ్రికా (IND Vs SA) మధ్య న్యూవాండరర్స్‌ (Johannesburg)వేదికగా జరిగిన తొలి వన్డేలో కెఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని యువ భారత్‌ (India Win) అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బౌలింగ్‌ చేసిన భారత్‌.. సఫారీలను 116 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఛేదనలో 16.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోక విజయాన్ని అందుకుంది. అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్‌ (Sai Sudarshan) (43 బంతుల్లో 55 నాటౌట్‌, 9 ఫోర్లు) తో పాటు వన్‌ డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (45 బంతుల్లో 52, 6 ఫోర్లు, 1 సిక్సర్‌) లు లక్ష్యాన్ని అవలీలగా ఛేదించడంతో భారత్‌ 8 వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించింది.

 

స్వల్ప ఛేదనలో భాగంగా భారత్‌.. నాలుగో ఓవర్లో 23 పరుగుల వద్ద ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (5) వికెట్‌ను కోల్పోయింది. వన్‌ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌తో (Shreyas) జతకలిసిన సాయి.. దక్షిణాఫ్రికాకు మరో అవకాశమే లేకుండా ఆడాడు. క్రీజులో కుదురుకునేదాకా సింగిల్స్‌, డబుల్స్‌కే పరిమితమైన అతడు.. షంసీ వేసిన 13వ ఓవర్లో బ్యాక్‌ టు బ్యాక్‌ బౌండరీలు బాదాడు. మరోవైపు ఎదుర్కున్న తొలి బంతికే బౌండరీకి తరలించిన అయ్యర్‌ కూడా అడపాదడపా ఫోర్లు బాదుతూనే వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీశాడు.

 

పెహ్లూక్వాయో వేసిన 16వ ఓవర్లో తొలి బంతికే బౌండరీ బాది 49 పరుగులకు చేరుకున్న సాయి.. రెండో బాల్‌ను డీప్‌ స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత స్ట్రైకింగ్‌ తీసుకున్న శ్రేయస్‌.. లేట్‌ చేయకుండా ముగించాలని చూశాడు. వరుసగా ఫోర్‌, సిక్సర్‌ బాది అర్థ సెంచరీ బాదాడు. కానీ ఐదో బంతికి భారీ షాట్‌ ఆడబోయి డేవిడ్‌ మిల్లర్‌ చేతికి చిక్కడంతో 88 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ తిలక్‌ వర్మ (1 నాటౌట్‌)తో కలిసి సాయి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు అర్ష్‌దీప్‌ ఐదు వికెట్లు, అవేశ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా 116 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య మంగళవారం (డిసెంబర్‌ 19న) రెండో వన్డే జరుగనుంది.