AUS Vs ENG (PIC@ ICC X)

Ahmadabad, NOV 04: డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ (England) జట్టుకు ఈ వరల్డ్‌ కప్ ఏ రకంగానూ కలిసిరావడం లేదు. ఇదివరకే సెమీస్‌ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించిన ఆ జట్టు.. తాజాగా పరువు నిలుపుకోవడంతో పాటు 2025లో పాకిస్తాన్‌ వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ లో (ICC Champions Trophy) అర్హత సాధించడం కూడా అనుమానంగానే మారింది. ఇదివరకే ఐదు మ్యాచ్‌లలో ఓడిన ఇంగ్లండ్‌.. తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో (AUS Vs PAK) ముగిసిన మ్యాచ్‌లో కూడా అపజయాల పరంపరను కొనసాగించింది. ఆఖర్లో ఉత్కంఠకు దారి తీసిన మ్యాచ్‌లో ఆసీస్‌ నిర్దేశించిన 287 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌.. 48.1 ఓవర్లలో 253కే ఆలౌట్‌ అయింది. తద్వారా 33 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘనవిజయం సాధించింది. ఈ ఓటమితో ఇంగ్లండ్‌ వరల్డ్ కప్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ఇది ఆరో పరాజయం.

 

287 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌కు (ENG) తొలి బంతి నుంచే కష్టాలు మొదలయ్యాయి. స్టార్క్‌ వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే జానీ బెయిర్‌ స్టో.. వికెట్‌ కీపర్ జోస్‌ ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఐదో ఓవర్లో స్టార్క్‌ ఇంగ్లండ్‌ను మరో దెబ్బ కొట్టాడు. ఆ ఓవర్లో మూడో బంతికి జో రూట్‌ (13) కూడా ఇంగ్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన బెన్‌ స్టోక్స్‌ ఈ వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు తొలిసారి తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. స్టార్క్‌, హెజిల్‌వుడ్‌, కమిన్స్‌ త్రయంతో పాటు స్టోయినిస్‌ లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌ (64 బంతుల్లో 50, 4 ఫోర్లు, 1 సిక్సర్‌) తో కలిసి మూడో వికెట్కు 84 పరుగులు జోడించాడు. ఆసీస్‌ బౌలర్లు కవ్వించే విధంగా బంతులు వేసిన స్టోక్స్‌ అనవసర షాట్లకు పోకుండా స్కోరుబోర్డును ముందుకుతీసుకెళ్లాడు. 63 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన మలన్‌.. ఆ తర్వాత బంతికే కమిన్స్‌ బౌలింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

 

మలన్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (1) మరోసారి విఫలమయ్యాడు. జంపా వేసిన 26వ ఓవర్లో తొలి బంతికి బట్లర్‌.. గ్రీన్‌ చేతికి చిక్కాడు. మరోవైపు స్టార్క్‌ వేసిన 31వ ఓవర్లో ఐదో బంతికి భారీ సిక్సర్‌ బాదిన స్టోక్స్‌.. 73 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మోయిన్‌ అలీ (43 బంతుల్లో 42, 6 ఫోర్లు) తో కలిసి ఐదో వికెట్‌కు 62 బంతుల్లోనే 63 పరుగులు జోడించిన స్టోక్స్‌ను జంపా బోల్తా కొట్టించాడు. లివింగ్‌స్టోన్‌ (2) కూడా మరోసారి చేతులెత్తేశాడు. ఇంగ్లండ్‌ చివరి ఆశగా భావించిన మోయిన్‌ అలీని జంపా 40వ ఓవర్లో తొలి బంతికి అలీని ఔట్‌ చేశాడు. 14 బంతుల్లో 3 బౌండరీలు కొట్టి 15 పరుగులు చేసిన డేవిడ్‌ విల్లేను హెజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. ఆఖర్లో క్రిస్‌ వోక్స్‌ (33 బంతుల్లో 32, 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులతో ఇంగ్లండ్‌ ఓటమి అంతరం తగ్గినా గెలుపు మాత్రం సాధ్యం కాలేదు.