Wriddhiman Saha (Image Credits - Twitter/@IPL)

Ahmadabad, May 07: డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) జైత్రయాత్ర కొన‌సాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ ప్రత్యర్థి జ‌ట్లను హ‌డ‌లెత్తిస్తోంది. సొంత గ్రౌండ్‌లో భారీ స్కోర్ చేసిన హార్దిక్ పాండ్యా (Hardik pandya) సేన వ‌రుస‌గా రెండో విజ‌యం సాధించింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 56 ప‌ర‌గుల తేడాతో గెలిచింది. తొలుత‌ ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్ (Shubman gill) (94 నాటౌట్ 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా(81 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీర‌విహారం చేయ‌డంతో ల‌క్నోకు 227 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో క్వింట‌న్ డికాక్(70), కైల్ మేయ‌ర్స్(48) మాత్రమే రాణించారు. కొండంత ల‌క్ష్య ఛేద‌నలో ల‌క్నోకు ఓపెన‌ర్లు కైల్ మేయ‌ర్స్(44), క్వింట‌న్ డికాక్(24) శుభారంభం ఇచ్చారు. ప‌వ‌ర్ ప్లేలో ధ‌నాధ‌న్ ఆడి 72 ప‌రుగులు సాధించారు. అయితే.. మోహిత్ శ‌ర్మ ఓవ‌ర్లో ర‌షీద్ ఖాన్ అద్భుత క్యాచ్‌తో మేయ‌ర్స్‌ను పెవిలియ‌న్ పంపాడు. అక్కడితో ల‌క్నో స్కోర్ నెమ్మదించింది.

దీప‌క్ హుడా(11), స్టోయినిస్ (4) విఫ‌ల‌మ‌య్యారు. ఆఖ‌ర్లో ఆదుకుంటాడ‌నుకున్న నికోల‌స్ పూర‌న్‌(3) చేతులెత్తేశాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ ఆయుష్ బ‌దొని(21) చివ‌ర్లో ధాటిగా ఆడాడు. దాంతో ల‌క్నో 171 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. గుజ‌రాత్ బౌల‌ర్లలో మోహిత్ శ‌ర్మ నాలుగు, ష‌మీ, నూర్ అహ్మద్, ర‌షీద్ ఖాన్ త‌లా ఒక వికెట్ తీశారు. గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు వృద్ధిమాన్ సాహా(81), శుభ్‌మ‌న్ గిల్(94 నాటౌట్) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. డేవిడ్ మిల్ల‌ర్(21 నాటౌట్) కూడా ధ‌నాధ‌న్ ఆడ‌డంతో గుజ‌రాత్ 2 వికెట్ల న‌ష్టానికి 227 ప‌రుగులు కొట్టింది.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్లను ఉతికారేసిన సాహా, గిల్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 142 ప‌రుగులు జోడించారు. ప్రమాద‌క‌రంగా మారుతున్న ఈ జోడీని అవేశ్‌ఖాన్ విడ‌దీశాడు. సాహా ఔట‌య్యాక గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా(10) ధాటిగా ఆడారు. పాండ్యా త‌ర్వాత వ‌చ్చిన మిల్లర్ మెర‌పు ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్నో బౌల‌ర్లలో అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.