GT Vs CSK (Photo-IPL)

Ahmadabad, May 27: ఐపీఎల్ 2023లో (IPL 2023) భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో (Mumbai Indians) జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (Gujrat Titans) విజ‌యం సాధించింది. త‌ద్వారా వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ గుజ‌రాత్ ఫైన‌ల్‌కు (GT in IPL Final) చేరుకుంది. ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై 18.2 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కీల‌క పోరులో శుభ్‌మ‌న్ గిల్(129; 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స‌ర్లు) దంచికొట్టాడు. సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 233 ప‌రుగులు చేసింది.

అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫ‌య‌ర్ 2లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జ‌రిగిన మ్యాచ్‌లో 62 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా హార్దిక్ సేన వ‌రుస‌గా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైన‌ల్స్‌కు దూసుకువెళ్లింది. ఆదివారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనుంది.

234 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై 18.2 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల‌కే ఆలౌలైంది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(61; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో దంచికొట్ట‌గా తిల‌క్ వ‌ర్మ‌(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడాడు. మిగిలిన వారిలో కామెరూన్ గ్రీన్(30) ప‌ర్వాలేద‌నిపించ‌గా, రోహిత్ శ‌ర్మ‌(8), నెహ‌ల్ వ‌ధేరా(4), టిమ్ డేవిడ్‌(2), విష్ణు వినోద్‌(2) విఫ‌లం అయ్యారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ర్మ ఐదు వికెట్లు తీయ‌గా ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ చెరో రెండు వికెట్లు, జాషువా లిటిల్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు న‌ష్ట‌పోయి 233 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (129; 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) శ‌త‌కంతో దంచికొట్టాడు. ఈ సీజ‌న్‌లో గిల్‌కు ఇది మూడో శ‌త‌కం కాగా.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడో సెంచరీ కావడం గమనార్హం. మిగిలిన వారిలో సాయి సుదర్శన్‌ (43), హార్దిక్‌ పాండ్య (28*) దూకుడుగా ఆడారు. ముంబయి బౌలర్లు ఆకాశ్‌ మధ్వాల్, పీయూశ్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు.