India vs Bangladesh 2nd ODI: చావో రేవో తేల్చుకునేందుకు రెడీ అయిన టీమిండియా, సెకండ్ వన్డేలో ఎట్టిపరిస్థితుల్లో గెలిచేందుకు వ్యూహాలు, బౌలింగ్‌ లో ఫామ్ కొనసాగిస్తే గెలుపు సాధ్యమే అంటున్న నిపుణులు
India vs Bangladesh 2nd ODI (Photo credit: Twitter @ICC)

Dhaka, DEC 07: బంగ్లాదేశ్‌తో రెండో వన్డేకు (India vs Bangladesh 2nd ODI) సిద్ధమయింది టీమిండియా. తొలి వన్డేలో పరాజయంతో విమర్శలను ఎదుర్కుంటున్న ఇండియన్ టీమ్..ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో (Shere Bangla National Stadium) రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేలో (1st ODI) ఓటమి‌పాలైన టీమిండియా.. రెండో వన్డేలో (2nd ODI) విజయం సాధించి పట్టునిలుపుకొనేందుకు పట్టుదలతో ఉంది.

ఈ మ్యాచ్ లో ఒత్తిడి భారత్ పైనే ఉంది. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో తడబడ్డా బౌలింగ్‌లో రాణించి గట్టెక్కేలా కనిపించిన టీమిండియా.. చివరిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. రెండో వన్డేలో కోహ్లీ, రోహిత్, ధావన్ లాంటి బ్యాటర్లు క్రిజ్ లో కుదురుకుంటే భారత్ పరుగుల వరదపారించడం ఖాయం అవుతుంది.

అయితే, బంగ్లా బౌలర్ల దాటిని టీమిండియా బ్యాటర్లు రెండోవన్డేలో ఏ విధంగా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. టీమిండియా పేలవ ఫీల్డింగ్ కూడా మొదటి వన్డేలో ఓటమి కారణమనే చెప్పాలి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ (KL Rahul) వదిలిపెట్టిన క్యాచ్ మూలంగానే మొదటి వన్డేలో టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాహుల్ తో పాటు పలువురు ఆటగాళ్లు చెత్త ఫీల్డింగ్ కారణంగానూ బంగ్లా విజయానికి బాటలు వేశాయి. మరోవైపు.. బంగ్లాదేశ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ముస్తాఫిజుర్, ఎబాదత్, హసన్ మహమూద్, షకీబ్, మొహదీ హసన్ లతో బంగ్లా బౌలింగ్ బలంగా ఉంది. బ్యాటింగ్ లోనూ ఆ జట్టు రాణిస్తుంది.

IND vs BAN 1st ODI 2022: టీమిండియా విజయాన్ని దూరం చేసిన మెహదీ హసన్ మిరాజ్, తొలి వన్డేలో టీమిండియాపై బంగ్లాదేశ్ విజయం.. 

అయితే తొలి వన్డేలో బంగ్లా బ్యాటర్లు టీమిండియా బౌలర్ల దాటికి క్రిజ్ లో ఎక్కువసేపు నిలబడలేక పోయారు. టీమిండియా బౌలర్లు రెండో వన్డేలోనూ మొదటి వన్డే తరహా బౌలింగ్ ప్రదర్శనను ఇస్తే టీమిండియా గెలుపు సాధ్యమవుతుంది. భారత్ చివరి సారి 2015లో బంగ్లాలో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. అప్పుడు ధోని నేతృత్వంలోని జట్టు 1-2 తో సిరీస్ ను చేజార్చుకుంది. ఆ ఒక్క విజయాన్ని కూడా నామమాత్ర మ్యాచ్ లో సాధించింది. మరోసారి చరిత్రను పునరావృతం చేసేందుకు బంగ్లా క్రీడాకారులు పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో నేడు జరిగే మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతే.. వరుసగా బంగ్లా దేశ్ లో రెండో వన్డే సిరీస్ ను చేజార్చుకోవాల్సి వస్తుంది.