India Beat South Africa (PIC@ ICC X)

Kolkata, NOV 05: వన్డే వరల్డ్‌ కప్‌లో (IND Vs SA) భారత జైత్రయాత్ర అప్రతీహాతంగా సాగుతోంది. వరుసగా ఎనిమిదో విజయాన్ని (India Beat South Africa) నమోదుచేస్తూ టీమిండియా రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ మెగాటోర్నీలో పరుగుల వరద పారిస్తున్న సఫారీల ఆటలు భారత్‌ ముందు సాగలేదు. 400 పరుగులను అవలీలగా కొడుతున్న సౌతాఫ్రికా.. 327 పరుగుల ఛేదనలో ముక్కీమూలిగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా చేయకుండా 83 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా భారత్‌.. 243 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (Ravindra jadeja) ఐదు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా షమీ (Shami), కుల్దీప్‌ యాదవ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆ జట్టులో మార్కో జాన్సెన్‌ 14 పరుగులతో టాప్ స్కోరర్‌.

 

అంతకుముందు భారత క్రికెట్‌ అభిమానులతో పాటు యావత్‌ ప్రపంచ క్రికెట్‌ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం ఈడెన్‌ గార్డెన్స్‌ లో సాక్షాత్కారమైంది. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ (భుఇలొ ఱే్ను).. భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వన్డేలలో నెలకొల్పిన 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. నేడు 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్‌ డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీ (121 బంతుల్లో 101 నాటౌట్‌, 10 ఫోర్లు)కి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (87 బంతుల్లో 77, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 40, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. కోహ్లీకి వన్డేలలో ఇది 49వ సెంచరీ కాగా మొత్తంగా 79వది. ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు మెరుపు ఆరంభం దక్కింది. రోహిత్‌ – శుభ్‌మన్‌ గిల్‌ (23) లు తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 62 పరుగులు జతచేశారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన రోహిత్‌ను రబాడా తాను వేసిన తొలి ఓవర్లోనే ఔట్‌ చేసి భారత్‌కు తొలి షాకిచ్చాడు. కోహ్లీతో కలిసి కొద్దిసేపు ఆడిన గిల్‌ను కేశవ్‌ మహారాజ్‌ బౌల్డ్‌ చేశాడు.