WTC Final, June 10: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానె (Rahane) (20), విరాట్ కోహ్లి (Kohli)(44) లు ఉన్నారు. టీమ్ఇండియా విజయం సాధించాలంటే ఆఖరి రోజు 90 ఓవర్లలో 280 పరుగులు అవసరం కాగా.. ఆసీస్ గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. టీమ్ఇండియా డ్రా కోసం కాకుండా విజయం కోసం ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగగా ఓపెనర్లు రోహిత్ శర్మ(43; 60 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్(18; 19 బంతుల్లో 2 ఫోర్లు)లు దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరు 7.1 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో మరోసారి గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు.
Stumps called with Kohli, Rahane keeping India in the hunt! 👊
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/Z9yMlvCLYA
— ICC (@ICC) June 10, 2023
గిల్ ఔటైనా కూడా రోహిత్ శర్మ (Rohit sharma) దూకుడు కొనసాగించాడు. అతడికి పుజారా(27; 47 బంతుల్లో 5 ఫోర్లు) జత కలిశాడు. వీరిద్దరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు పెవిలియన్‌కు చేరుకున్నారు. నాథన్ లయన్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ కాగా ఆ మరుసటి ఓవర్‌లోనే పుజరాను కమిన్స్ బోల్తా కొట్టించాడు. దీంతో 93 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది.
సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (Virat kohli), అజింక్యా రహానె లు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. వీరిద్దరు మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. అభేధ్యమైన నాలుగో వికెట్‌కు వీరిద్దరు 71 పరుగులు జోడించారు. ఆఖరి రోజు వీరిద్దరు ఎంత సేపు క్రీజులో ఉంటారు అన్న దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అంతముందు 123/4 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా 270/8 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. . ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ కేరీ(66 నాటౌట్) అర్ధశతకంతో అలరించగా మిచెల్ స్టార్క్ 41 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ చెరో రెండు, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.