New Delhi, June 15: టీమ్ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant) గతేడాది డిసెంబర్‌లో కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ (NCA) అకాడమీలో పూర్తి ఫిట్‌నెస్ సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. తన ఆరోగ్యంపై, కోలుకుంటున్న విధానంపై ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియా వేదికగా పంత్ ఎప్పటికప్పుడు అప్డేట్‌లు ఇస్తూనే ఉన్నాడు. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పంత్ ఎవరి సాయం లేకుండానే మెట్లను ఎక్కుతున్నాడు. ‘నాట్ బ్యాడ్ యార్ రిషబ్.. సాధారణ విషయాలే కొన్ని సార్లు కష్టంగా ఉంటాయి.’ అని ఈ వీడియో కింద రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అతడిని గ్రౌండ్‌లో చూడాలని ఆకాంక్షిస్తున్నారు.
Not bad yaar Rishabh ❤️❤️😂. Simple things can be difficult sometimes 😇 pic.twitter.com/XcF9rZXurG
— Rishabh Pant (@RishabhPant17) June 14, 2023
రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పంత్ ఈ ఏడాదిలో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్‌తో పాటు ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఆసియా కప్ కూడా ఆడడం అనుమానమే. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వన్డే ప్రపంచ కప్ నాటికి పంత్ మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా లండన్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పంత్ ఉండి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఒంటి పోరాటం చేస్తూ శతకాలతో జట్టును గెలిపించాడు.