Yashasvi Jaiswal (PIC@ BCCI X)

Trivandrum, NOV 26: భార‌త యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) చ‌రిత్ర సృష్టించాడు. టీ20ల్లో ప‌వర్ ప్లేలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన భార‌త ఆట‌గాళ్ల‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆదివారం తిరువ‌నంత‌పురంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 (T-20) మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. రుతురాజ్‌తో క‌లిసి ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన జైస్వాల్ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. ఆసీస్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. ముఖ్యంగా సీన్ అబాట్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 4,4,4,6,6 బాది 24 ప‌రుగులు సాధించాడు. అదే దాడిని కొన‌సాగిస్తూ 24 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని (Half Century)పూర్తి చేసుకున్నాడు. ఆ మ‌రుస‌టి బంతికే నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఆడ‌మ్ జంపా క్యాచ్ అందుకోవ‌డంతో జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా జైస్వాల్ 25 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 53 ప‌రుగులు చేశాడు. దీంతో భార‌త్ ప‌వ‌ర్ ప్లే వికెట్ న‌ష్ట‌పోయి 77 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియాపై టీ20ల్లో ప‌వ‌ర్‌ప్లేలో ఇదే అత్య‌ధిక స్కోరు కావ‌డం విశేషం.

 

టీ20ల్లో జైస్వాల్ ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా రికార్డు నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో అత‌డు రోహిత్ శ‌ర్మ, కేఎల్ రాహుల్ ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. 2021లో స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (50 ప‌రుగులు), న్యూజిలాండ్‌తో 2020లో జ‌రిగిన మ్యాచులో రోహిత్ శ‌ర్మ (50 నాటౌట్ )లు అర్ధ‌శ‌త‌కాలు బాదారు. తాజాగా 53 ప‌రుగుల‌తో జైస్వాల్ వీరి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు.

 

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బ్యాట‌ర్లు దంచి కొట్ట‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 235 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (53 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్ (58 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఇషాన్ కిష‌న్ (52 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు అర్ధ‌శ‌త‌కాలు చేశారు. ఆఖ‌ర్లో రింకూ సింగ్ (31 నాటౌట్‌ 9 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కస్ స్టోయినిస్ ఓ వికెట్ తీశాడు.