Birmingham, AUG 07: మహిళల వరల్డ్ ఛాంపియన్ బాక్సర్, తెలంగాణ తేజం నిఖత్ జరీన్ (Nikhat Zareen) మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. బర్మింగ్‌హామ్ (Birmingham) వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో (Commonwealth Games 2022) పసిడి పంచ్ విసిరింది. ఈ టోర్నీలో 48-50 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో పోటీ పడిన ఆమె.. ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్‌లో కార్లీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్ 5-0 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ నిఖత్ ఇదే స్కోరుతో గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్‌ను అంపైర్ మరో రెండున్నర నిమిషాలు ఉండగా.. ఆపేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. ఇంతకుముందే మరో మహిళా బాక్సర్ నీతూ ఘంఘాస్ కూడా బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరు భారత మహిళలు ఒకే కామన్‌వెల్త్ ఎడిషన్‌లో స్వర్ణాలు సాధించడం ఇదే తొలిసారి.

అటు ఇప్పటికే మహిళల బాక్సింగ్‌లో నీతూ ఘంఘాస్ (Nitu Ghanghas) 48 కేజీల విభాగంలో, పురుషుల బాక్సింగ్‌లో అమిత్ పంఘాల్ (Amit Panghal) 51 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించారు. అమిత్ పంఘాల్.. ఇంగ్లండ్‌కు చెందిన మ్యాక్ డొనాల్డ్‌ను 5-0 తేడాతో ఓడించాడు. నీతూ.. 2019 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌లో బ్రాంజ్ మెడలిస్ట్ అయిన డెమీ జేడ్ రెస్టాన్‌పై 5-0తో విజయం సాధించింది.

మరోవైపు భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 2-1తో విజయం సాధించింది. దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఇలా భారత మహిళా హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించడం విశేషం. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మ్యాచులో కూడా మెరుగైన ప్రదర్శనే చేసింది మన జట్టు. కానీ, అంపైర్ వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఫైనల్ చేరలేకపోయింది. అయితే, కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచులో మాత్రం మహిళా హాకీ టీమ్ అదరగొట్టింది.

అలాగే పది వేల మీటర్ల రేస్ వాక్‌లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్దోస్ పాల్ బంగారు పతకం సాధించగా, అబ్దుల్లా అబూబాకర్ రజత పతకం సాధించాడు. బ్యాడ్మింటన్‌ మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఫైనల్ చేరాడు. సింగపూర్‌కు చెందిన జియా హెంగ్‍‌పై 2-1తో విజయం సాధించాడు. ఇంకా పలు మ్యాచులు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో వాటికి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.