Nitu Ghanghas Clinches Gold Medal (Photo Credits: @PBNS_India/Twitter)

New Delhi, March 25: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ (Women Boxing Championship) ఫైనల్‌లో భారత క్రీడాకారిణి నీతూ గంగాస్ (Nitu Ghanghas) విజేతగా నిలిచింది. శనివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోరులో 48 కిలోల విభాగంలో నీతూ గోల్డ్ మెడల్ సాధించింది. మంగోలియాకు చెందిన బాక్సర్ లుత్సైఖాన్ అల్టాన్సెట్సెంగ్‌పై 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించిన ఆరో భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది. ఈ ఫైనల్‌లో నీతూ అద్భుత ప్రదర్శన చేసింది. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా వరుస పాయింట్లతో దూసుకెళ్లింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా ఆడింది.

అంతకుముందు రోజు జరిగిన సెమీ ఫైనల్‌లో నీతూ.. కజకిస్తాన్‌కు చెందిన అలువాపై గెలుపొందింది. నీతూకంటే ముందు మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీ, నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారు. వీరిలో మేరీ కోమ్ ఆరుసార్లు గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. ఈ మ్యాచ్ అనంతరం మరో భారత క్రీడాకారిణి కూడా ఫైనల్ ఫైట్‌లో పాల్గొనబోతుంది. ఇండియాకు చెందిన సవీటి బూర ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ లినాతో పోటీ పడుతోంది. 81 కేజీల విభాగంలో ఈ పోటీ జరుగుతుంది.