Commonwealth Games 2022: రెజ్లింగ్‌లో భారత్‌కు పసిడి పంట, శనివారం కూడా భారత్ ఖాతాలో మూడు గోల్డ్ మెడల్స్, వరుసగా మూడు కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ సాధించిన వినేష్ ఫొగట్, అరంగేట్రంలోనే అదరగొట్టిన నవీన్‌

Birmingham, AUG 06: బర్మింగ్ హమ్ (Birmingham) వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు అదరగొడుతున్నారు. భారత్ కు (India) పతకాల పంట పండిస్తున్నారు. నిన్న ముగ్గురు రెజ్లర్లు గోల్డ్ మెడల్స్ (Gold medals) సాధించగా....ఇవాళ కూడా మరో ముగ్గురు పసిడి పంట పండించారు. తాజాగా రెజ్లింగ్ విభాగంలో దేశానికి మరో మూడు గోల్డ్ మెడల్స్ (Three gold medals) అందించారు. ఇప్పటికే ముగ్గురు కుస్తీ వీరులు బజరంగ్ పునియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్ గోల్డ్ మెడల్స్ సాధించగా.. శనివారం రవి దహియా, వినేష్‌ పొగట్‌. నవీన్‌ స్వర్ణాలు సాధించారు. పురుషుల ఫ్రీ స్టైల్ 57కిలోల విభాగంలో ఫైనల్ లో రవి దహియా  (Ravi dahiya).. నైజీరియాకు చెందిన ఎబికేవినెమోను మట్టికరిపించి పసిడి సాధించాడు.

మహిళల 53 కేజీల విభాగంలో వినేష్‌ పొగట్‌ (Vinesh Phogat) .. శ్రీలంకకు చెందిన చమోద్య కేశనీపై విజయం సాధించింది. ఇక రెజ్లర్ నవీన్ (Naveen) పాకిస్తాన్ కు చెందిన మహమూద్ షరీఫ్ తాహిర్ ను 74 కేజీఫ్రీ స్టైల్ విభాగంలో ఓడించాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఆరో స్వర్ణం. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ స్వర్ణాల సంఖ్య 12 కి చేరింది.

ఇక రవి దహియా 3 సార్లు ఆసియా చాంపియన్ గా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ లోనూ రజత పతకం సాధించాడు. ఆడిన తొలిసారే కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడం విశేషం. వినేశ్ పొగట్ కూడా అరుదైన ఘనత సాధించింది. వినేశ్ పొగట్ కు కామన్ వెల్త్ గేమ్స్ లో ఇది వరుసగా మూడో పసిడి పతకం కావడం విశేషం. ఆసియా క్రీడల్లోనూ వినేశ్ పొగట్ స్వర్ణం సాధించింది. ఇలా ఆసియా గేమ్స్ తో పాటు కామన్ వెల్త్ గేమ్స్ లోనూ గోల్డ్ సాధించిన తొలి భారత మహిళగా వినేశ్ పొగట్ ఘనత సాధించింది. అంతేకాదు.. కామన్ వెల్త్ గేమ్స్ లో వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారత మహిళగానూ వినేశ్ పొగట్ చరిత్ర లిఖించింది.

అటు నవీన్ కూడా తన తొలి కామన్ వెల్త్ గేమ్స్ లోనే స్వర్ణాన్ని ముద్దాడారు. పాకిస్థాన్ కు చెందిన తాహిర్ ను 9-0 తేడాతో ఓడించాడు. ముగ్గురు రెజ్లర్లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు రెజ్లింగ్‌ మహిళల 50కేజీల విభాగంలో పూజా గెహ్లోత్‌ కాంస్యం సాధించింది. కామన్ వెల్త్‌ క్రీడల్లో 50కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆమె 12-2తో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టెల్టే లామోఫాక్ లెచిడ్జియోను చిత్తు చేసింది