Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

Amaravati, Nov 1: ఏపీలో గత కొద్ది రోజులుగా రాజధాని అంశం హీటెక్కిస్తున్న సంగతి విదితమే.అధికార పార్టీ వికేంద్రీకరణ, మూడు రాజధానులతోనే అభివృద్ధి అంటే ప్రతిపక్షాలు అమరావతి రాజధానిగా ఉండాలంటూ పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో (Supreme Court ) విచారణకు రానుంది.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు. లలిత్‌ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టనుంది.రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో (Andhra Pradesh’s SLP) కోరింది.

పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక అంశాలివే..

►రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదు

►రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి.

►శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం

►తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం

►రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది

►ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు

►రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు

►రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి

►2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి

►అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం

►రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది

►రైతుల తో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు

►వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు

►రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం

►అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది , ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది