Hyderabad, AUG 27: మతాల పేరు చెప్పుకుని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే.. వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై రాద్ధాంతం చేయడం అవసరమా? అని కేటీఆర్ (KTR) నిలదీశారు. కొన్నిరోజులుగా తెలంగాణలో చోటుచేసుకున్న పరిణామాలపై కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో (BR Ambedkar Open University) శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మతాల పేరిట జరుగుతున్న గొడవలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ”ఏ దేవుడు చెబుతున్నాడు తన్నుకు చావండని? ఏ మతం దేవుడైనా చెప్పాడా? కృష్ణుడు చెప్పాడా? రాముడు చెప్పాడా? యేసుక్రీస్తు చెప్పాడా? అల్లా చెప్పాడా? నా మనషులను పంపిస్తున్న భూమి మీదకు ఒకరికొకరు తన్నుకు చావండి. ఎవరి దేవుడు గొప్ప అనే పోటీ పెట్టుకుని తన్నుకు చావండి అని చెప్పాడా?” అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
Which God told you to fight against each other ?
Minister @KTRTRS pic.twitter.com/r3QOs8zC65
— krishanKTRS (@krishanKTRS) August 27, 2022
8 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఏం సాధించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయన్న కేటీఆర్… ఈ 8 ఏళ్ల స్వల్ప కాలంలోనే నీటిపారుదల రంగంలో తెలంగాణ దేశానికే ఓ నమూనాగా మారిందని చెప్పారు. ఈ రంగంలో రాష్ట్రం ఉజ్వల స్థితికి చేరిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జల సంరక్షణలో ఐఏఎస్‌లకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదగటమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కేసీఆర్ (KCR) హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్న కేటీఆర్… దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిపిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందన్నారు.
అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజలు ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నారు అని మండిపడ్డారు. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారని కేంద్రంపై సీరియస్ అయ్యారు కేటీఆర్. జీడీపీని గ్యాస్, డీజిల్, పెట్రోల్ గా అభివర్ణించిన కేటీఆర్.. జీడీపీ (GDP) బాగా పెరిగిపోయిందని విమర్శించారు. స్టాండప్ కమెడియన్ ఫారూఖీ మునావర్ (Munawar) పైనా పంచాయితీ పెడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. మతం పేరుతో, తన పేరుతో తన్నుకు చావమని ఏ దేవుడు చెప్పాడని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ (BJP) నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వీటిపైన చర్చించమంటే ముందుకురాని బీజేపీ నేతలు మతకల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం ఉవిళ్లూరుతున్నారని ఫైర్ అయ్యారు. పేదలకు కనీస అవసరాలను కల్పించడంలో పోటీ పడాలి కానీ మత ఘర్షణలు సృష్టించడంలో కాదని కేటీఆర్ హితవు పలికారు.