Hyd, August 21: ప్రముఖ తెలుగు నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరుల సమక్షంలో ఢిల్లీలో ఆమె కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. తరుణ్ చుగ్ కండువాను కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ... గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఆమె బీజేపీలో చేరినట్లు చెప్పారు.
తెలుగు సహా వివిధ భాషల్లో ఆమె ఎన్నో సినిమాలు చేశారని, ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. ఆమెకు ఎన్నో నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయన్నారు. సినీ పరిశ్రమలో ఆమెకు మంచి పేరు ఉందన్నారు. 2009 నుండి 2014 వరకు ఆమె ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారన్నారు.
బీజేపీలో చేరిన అనంతరం జయసుధ మాట్లాడుతూ..కులాలు, మతాలపరంగా కాకుండా తాను ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నానని, అందుకే బీజేపీలో చేరానని అన్నారు. తాను బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన నాయకత్వంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ విషయాన్ని తాను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, అందరికీ తెలిసిందే అన్నారు.
Here's ANI Video
#WATCH | "...We have to serve this country under the leadership of PM Modi. Today when we go out of India, people talk about India...What we are today is because of PM Modi...," says Telugu actor and former MLA, Jayasudha who joined BJP today. pic.twitter.com/zQMyV5y7Cy
— ANI (@ANI) August 2, 2023
తాను బీజేపీలో చేరానంటే చాలామందికి ఆశ్చర్యం వేయవచ్చునని, కానీ కులాలపరంగా కాకుండా మంచి కోసం పని చేయాలని భావిస్తున్నానని చెప్పారు. బీజేపీలో చేరడంపై ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయని, అమిత్ షాను కూడా కలిశామన్నారు. నటిగా తాను అందరికీ చెందిన వ్యక్తిని అన్నారు. ప్రజలకు... పేదలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని ఎంచుకున్నట్లు చెప్పారు. తాను సికింద్రాబాద్, ముషీరాబాద్‌ల నుండి పోటీ చేస్తాననేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. తాను ఇక సినిమాల కంటే రాజకీయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు.