Telangana Assembly (PIC@Wikimedia commons)

Hyderabad, AUG 03: అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ఇవాల్టి నుంచి మొదలుకానున్నాయి. సమావేశాల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ నిర్వహణపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు (Assembly Session) మొదలవుతాయి. శాసనసభలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న (Sayanna) మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా మండలి సమావేశంలో సభలో చర్చించాల్సిన అంశాలు, సభను ఎన్ని రోజులు నడుపాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్‌ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు.

 

శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీ వేదల వెంకటనర్సింహాచారి మృతికి సంతాపం తెలపనున్నారు. అనంతరం ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, చేపట్టిన సహాయ చర్యలపై స్వల్పకాలిక చర్చ జరగనున్నది. శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం (BAC meeting) నిర్వహించనున్నారు. మండలిలో పలు నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం 4-5 బిల్లులను సభలో పెట్టనున్నట్టు తెలిసింది. వీటిపై బీఏసీలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈసారి చర్చించాల్సిన అంశాలు మరీ ఎక్కువగా లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి. 3,4 రోజులు సరిపోతాయని భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సమావేశాలు అర్థవంతంగా జరుగుతున్నాయని, సమయాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకుంటున్నారని పేరున్నది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభా నాయకుడు, సీఎం కేసీఆర్‌ ఇటీవల మరణించిన దివంగత ఎమ్మెల్యే జీ సాయన్నకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారని అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన ఎజెండాలో పేర్కొన్నారు.