Munugode, NOV 03: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ (Munugode bypoll) కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (polling) జరగనుంది. ఈ ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS), బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress), బీఎస్పీ (BSP), టీజేఎస్‌తో (TJS) పాటు మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటుతో పాటు వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు కలిపి మొత్తం 5వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గోనున్నారు. 298 పోలింగ్ బూత్ లలో 49 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కోసం మొత్తం 1192 ఈవీఎంలు, 596 వీవీ ప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తున్నారు. పోలింగ్ విధుల్లో 373 మంది పీవో, ఏపీవోలు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో.. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 23,914, చండూరు మున్సిపాలిటీలో 10,768 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
Telangana | People queue up to cast their votes for Munugodu by-elections; visuals from Tangadapally polling station in Munugodu Assembly Constituency pic.twitter.com/WDejl6nhhv
— ANI (@ANI) November 3, 2022
అదేవిధంగా మండలాల వారిగాచూస్తే.. చౌటప్పల్ మండలంలో 35,519 మంది ఓటర్లు, నారాయణపురం మండలంలో 36,430, మునుగోడులో 35,780, చండూరులో 22,741, మర్రిగూడలో 28,309 మంది ఓటర్లు, నాంపల్లి మండలంలో 33,819 మంది, గట్టుప్పల మండలంలో 14,525 మంది ఓటర్లు ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు నువ్వానేనా అన్నట్లుగా ప్రచారాన్ని కొనసాగించారు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పలు గ్రామాల్లో ఘర్షణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.