Amit Shah Slams KCR (PIC @ ANI Twitter)

Hyderabad, April 23: సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని కలలు కంటున్నారు.. ప్రధాని సీటు ఖాళీగా లేదని కేసీఆర్‌ (KCR) తెలుసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith shah) అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని అని పేర్కొన్నారు. కేసీఆర్‌ ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) ప్రజల నుంచి సీఎం కేసీఆర్‌ దూరం చేయలేరని అన్నారు. బీజేపీపార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో భాగంగా చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌ బీఆర్ఎస్ (BRS) పేరుతో దేశమంతా విస్తరించాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కారు స్టీరింగ్‌ మజ్లీస్‌ చేతుల్లో ఉందని, మజ్లిస్‌కు బీజేపీ భయపడేది లేదని స్పష్టం చేశారు. మజ్లిస్‌కు (AIMIM) భయపడే బీఆర్‌ఎస్ ప్రభుత్వం..తెలంగాణ విమోచన దినం కూడా నిర్వహించట్లేదన్నారు.

‘‘టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్లు లీకవుతున్నాయి. లీకేజీలపై కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడరు. యువకుల జీవితాలతో సీఎం ఆటలాడుతున్నారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. పేపర్‌ లీకేజీపై ప్రశ్నించిన బండి సంజయ్‌ను (Bandi Sanjay) జైల్లో పెట్టారు. 24 గంటల్లో సంజయ్‌కు బెయిల్‌ వచ్చింది. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలనుకున్నారు. కానీ, వారికి సాధ్యం కాలేదు. జైళ్లకు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు భయపడరు అన్నారు.

మిమ్మల్ని గద్దె దించేవరకు మా కార్యకర్తలు విశ్రమించరు. రాష్ట్రంలో బీజేపీఅధికారంలోకి వస్తే దొంగలను జైల్లో వేస్తాం. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. కేసీఆర్‌కు మళ్లీ చెబుతున్నా.. మావాళ్లు జైళ్లకు భయపడరు. ఈ లీకేజీల ప్రభుత్వానికి కొనసాగే అర్హత ఉందా? టీఎస్‌పీఎస్సీ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.