Zero FIR in Telangana: ఇకపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఫాస్ట్‌ట్రాక్ ఇన్వెస్టిగేషన్, దిశ ఘటన నేపథ్యంలో సమూల సంస్కరణలు
TS Home Minister Holds High Level Meeting on Women & Child Safety | Photo: ANI

Hyderabad, December 5: ముఖ్యమైన నేరానికి సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు రాష్ట్రంలోని ఏ పోలీసు స్టేషన్‌లో అయినా తమ అధికార పరిధితో సంబంధం లేకుండా పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలతో హోం మంత్రి మహమూద్ అలీ (Mahmood Ali)  నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ, పశుసంవర్థక శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోంమంత్రి కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డీజీపీ మహేంధర్ రెడ్డి సహా, నగర పోలీసు కమీషనర్లు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

దిశ ఉదంతం లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చాలా సీరియస్‌గా, లోతైన చర్చలు జరిపారు.  వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన సంస్కరణలపై సమాలోచనలు చేశారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

హైలెవల్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి

 

  • 'జస్టిస్ ఫర్ దిశ'  (Justice For Disha) కేసు దర్యాప్తును త్వరితగతిన పుర్తి చేయాలి. మహిళలకు సంబంధించిన నేరాలు, అదృశ్యం లాంటి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఏమాత్రం అలస్యం చేయకుండా, పోలీస్ స్టేషన్ పరిధి గురించి ఆలోచించకుండా అప్పటికప్పుడే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలి. ఇందుకోసం జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR)  రాష్ట్రమంతా అమలు చేయాలి.
  • గ్రామాల్లో “అసాధారణ ప్రవర్తన” (Abnormal Behavior)   ఉన్న యువత వివరాలు తీసుకొని పోలీసులు వారిపై నిఘా వేసి ఉంచాలి. వారి ప్రవర్తనకు సంబంధించి ఏదైనా మార్పు గమనిస్తే పంచాయతీ కార్యదర్శులు పోలీసులకు సమాచారం అందించాలి. వారికి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. పట్టణ, నగర స్థాయిలో కూడా ఇదే విధానం అనుసరించాలి.
  • ఇదే కాకుండా, ప్రాథమిక పాఠశాల స్థాయి నుండే ఒక అమ్మాయి పట్ల ఎలా మెలగాలి, స్త్రీని గౌరవించేలా పిల్లలలో నైతిక విలువలు మరియు నీతిని పెంపొందించే వ్యవస్థను విద్యా శాఖ రూపొందిస్తుంది. షీ-టీమ్స్ సమన్వయంతో నైతిక విలువలపై ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించనున్నారు.
  • రాష్ట్రంలోని మహిళల మరియు పిల్లల భద్రత కోసం వివిధ విభాగాలను కలుపుకొని వ్యవస్థ నడిచే విధానాన్ని రూపొందించడానికి దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక చర్యలు ప్రతిపాదించబడ్డాయి. స్వయం సహాయక బృందాలు , గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ, ఆశా కార్మికులు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీ సంఘాల సమన్వయంతో పంచాయతీ రాజ్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల అధికారులు ప్రజలను చైతన్య పరిచే వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి.
  • ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా పేరేంట్స్ - టీచర్స్ మీటింగ్స్ క్రమం తప్పకుండా నిర్వహించాలి, తద్వారా విద్యార్థుల ప్రవర్తన, వారి హాజరును పేరేంట్స్ సమక్షంలో పర్యవేక్షించవచ్చు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు అందుబాటులో ఉన్న పోలీసు హెల్ప్‌లైన్‌లు మరియు మొబైల్ యాప్ ల గురించి విద్యార్థులకు ముఖ్యంగా బాలికలు మరియు మహిళలకు విస్తృత- అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
  • పోలీసుల సహాయం కోరుతూ డయల్ 100, 181, 1098 మరియు 112 లాంటి సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై ప్రచారం నిర్వహించడం.
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలలో ఈ హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన నోటీసు బోర్డులు ప్రదర్శించబడతాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బస్సు, రైల్వే మరియు మెట్రో స్టేషన్లలో అలాగే వాహనాలపై కూడా ఈ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రదర్శించాలి.
  • మహిళలు మరియు పిల్లల భద్రతా సమస్యలపై పాఠశాలలు మరియు కళాశాలల్లోని విద్యార్థులకు వివిధ ఇ-లెర్నింగ్ కోర్సులు ప్రారంభించబడతాయి, అలాగే మహిళల భద్రత మరియు పోలీసు హెల్ప్‌లైన్‌లపై లఘు చిత్రాలు మరియు స్లైడ్‌లు టీవీ మరియు సినిమా థియేటర్లలో ప్రదర్శించబడతాయి.