New Delhi, JAN 13: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చరిత్రను సృష్టించేందుకు రెడీ అయ్యింది. స్పాడెక్స్ మిషన్‌లో భాగంగా తొలిసారిగా స్పేస్ డాకింగ్ మిషన్‌ను నిర్వహించనున్నది. ఇందుకోసం నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను ఆదివారం మూడు మీటర్ల దగ్గరగా తీసుకువచ్చింది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాయని.. డాకింగ్ ప్రక్రియ కోసం రెండు ఉపగ్రహాలను దగ్గరగా తీసుకువచ్చినట్లు ఇస్రో పేర్కొంది. ఈ రెండు ఉపగ్రహాలు ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి పంపాయి. రెండు శాటిలైట్స్‌ను మొదట 15 మీటర్లకు.. ఆ తర్వాత మూడు మీటర్లకు తీసుకువచ్చింది. డేటాను మరింత విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం డాకింగ్‌కు కేవలం 50 అడుగులు దూరంలో ఉన్నామని ఇస్రో పేర్కొంది.
చిన్న అంతరిక్ష నౌకను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ ప్రక్రియను ప్రదర్శించడం డాకింగ్ ఉద్దేశం. అయితే, జనవరి 7, 9 తేదీల్లో డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పాడెక్స్) వాయిదాపడింది. డిసెంబర్ 30న ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పాడెక్స్) మిషన్‌ను విజయవంతంగా ప్రయోగం చేపట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో తొలి లాంచ్‌ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ రెండు ఉపగ్రహాలతో పాటు 24 పేలోడ్లను మోసుకెళ్లింది. దాదాపు 15 నిమిషల తర్వాత ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను వృత్తాకార క్షక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ రెండు రాకెట్లు ఒక్కోటి 220 కిలోల బరువు ఉంటుంది.
డాకింగ్ పూర్తయితే.. ఈ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించనున్నది. భారత్‌లో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌ను నిర్మించబోతున్నది. అలాగే, చంద్రుడిపైకి వ్యోమగాబులను పంపాలని చూస్తున్నది. ఈ క్రమంలో సంక్లిష్టమైన మిషన్లకు తప్పనిసరిగా డాకింగ్ సాంకేతిక టెక్నాలజీ అవసరం. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఉన్నది. ఇస్రో డాకింగ్ ఎక్స్పెరిమెంట్ విజయవంతంగా నిర్వహిస్తే.. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నాలుగో దేశంగా నిలువనున్నది.