
Hyderabad, JAN 12: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (Manda Jagannadam) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్ కర్నూల్ ఎంపీగా పని చేశారు. తొలిసారిగా 1996 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 1998 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
ఆయన 1999-2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో, 2008-2013 మధ్యకాలంలో కాంగ్రెస్‌లో, 2013-14 మధ్యకాలంలో టీఆర్‌ఎస్ పార్టీల్లో కొనసాగారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. 2022 జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్ నియమించారు. ఆయన 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ లోక్‌సభ ఇవ్వకపోవడంతో ఆయన బీఎస్పీలో చేరారు. మందా జగన్నాథం మృతికి బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి బాధాకరమని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాలుగు సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేసి, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. బీఆర్ఎస్ పార్టీకి సేవలందించారు. జగన్నాథం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.